కొల్లాపూర్(పెంట్లవెల్లి), అక్టోబర్ 18: దశాబ్దాల కల ఎట్టకేలకు నెరవేరబోతున్నది. కొల్లాపూర్ మండలం సోమశిల-సిద్దేశ్వరం మధ్య కృష్ణానదిపై రూ.1,100కోట్లతో ఐకాన్ వంతెన నిర్మాణ ప్రక్రియకు ప్రభుత్వం త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నది. అందుకుగానూ నవంబర్ మొదటి వారంలో మూహూర్తం ఖరారు చేసింది. దీంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నందున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మం గళవారం పెంట్లవెల్లి మండలకేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ రాములు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కొట్ర, కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, సోమశిల, ఆత్మకూర్, కర్వెన, నంద్యాల వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 167కే) నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసింది. టెండర్లను జాతీయ రహదారుల అధికారులు ఓపెన్ చేసే ప్రక్రియ మిగిలింది. దీంతో తమ ప్రాంతం మీదుగా జాతీయ రహదారి, కృష్ణానదిపై ఐకాన్ బ్రిడ్జి త్వరలో నిర్మించనున్నారని హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీరం కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పోతుల వెంకటేశ్వర్లు, సింగిల్‌విండో చైర్మన్ విజయరామారావు, నాయకులు రాజేశ్, సురేందర్‌గౌడ్, హనుమంత్, జటప్రోలు సర్పంచ్ ఎస్కే ఖాజా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రఫీ, రామకృష్ణ, నాయకులు వెంకటస్వామి, రాజు, నరసింహారెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు.