కొల్లాపూర్, సెప్టెంబర్ 22 : తెలంగాణలో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. వారు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మండలంలోని సింగవట్నం శ్రీవారి సముద్రంలో జలాలకు ఎమ్మెల్యే పూజలు చేశారు. అనంతరం 2.80 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. అంతకుముందు గ్రామస్తులు మేళతాళాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో ప్రభుత్వం ఉచితంగా అందించిన చేపపిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రంలో నీలివిప్లవం సంతరించుకున్నదని వివరించారు.
చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగారని తెలిపారు. చేపల వలలు, వాహనాలు, ఐస్ బాక్సులను ఉచితంగా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. వరుణుడి కరుణతో ఈసారి చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుడు నర్సింహ కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అతడి భార్యకు అందజేశారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా అధికారి లక్ష్మప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌నాయక్, ఎంపీపీ భోజ్యానాయక్, సర్పంచులు మండ్ల కృష్ణయ్య, రాజు, మాచినేనిపల్లి సింగిల్‌విండో చైర్మన్ శ్రీనువాసులు, వైస్ చైర్మన్ స్వామి, మాజీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి, కౌన్సిలర్ కృష్ణమూర్తి, మాజీ ఉపసర్పంచ్ చంద్రశేఖరాచారి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కిరణ్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.