మూసాపేట, సెప్టెంబర్ 19 : మండలంలోని అన్ని గ్రా మాలను ఉత్తమ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, ఎంపీడీవో స్వరూప కోరారు. మండలకేంద్రంలోని రైతువేదికలో సోమవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా సమావేశాన్ని ఆలస్యం గా ప్రారంభించడంపై నిజాలాపూర్ ఎంపీటీసీ సీజీ గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల తీరును నిరసిస్తూ సభను బహిష్కరించి వెళ్లిపోతామన్నారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ.. సభ్యులందరికీ ముందస్తు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచించామని, ఏమైనా పొరపాటు జరిగితే మన్నించాలని కోరారు. దీంతో సభ్యులు శాంతించి సమావేశాన్ని కొనసాగించారు. ముందుగా ఇటీవల మృతి చెందిన నందిపేట సర్పంచ్ శేఖర్‌రెడ్డికి నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. అనంతరం మహ్మదుస్సేన్‌పల్లి స ర్పంచ్ నిర్మలాకాశీనాథ్, తుంకినీపూర్ సర్పంచ్ లక్ష్మణ్, నందిపేట ఇన్చార్జి సర్పంచ్ శేఖర్ మాట్లాడుతూ గ్రామా ల్లో వీధిలైట్లు నిరంతరం వెలుగుతున్నాయని, లూజులైన్లు సరిచేయకపోడంతో విద్యుత్ సమస్య ఏర్పడుతున్నదని తెలిపారు.
గతంలో గ్రామపంచాయతీకి కరెంట్ బిల్లు రూ.6వేలు మాత్రమే వచ్చేదని, అధికారుల నిర్లక్ష్యంవల్ల రూ.16వేల వరకు బిల్లు వస్తుందన్నారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనుల వివరాలను ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. అయితే పలు పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నభోజనం సక్రమంగా అందడంలేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి హామీ పనుల వివరాలను ఏపీవో పులేందర్ వివరిస్తుండగా, సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో చేసి న ఫిర్యాదులను నేటికీ పరిష్కరించకపోవడంపై నిలదీశా రు. ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా వేయించాలని వెటర్నరీ డాక్టర్ మధుసూదన్ కోరారు. మహిళలకు ఉచితంగా కుట్టు, ఎంబ్రాయిడ రీ శిక్షణ ఇస్తున్నామని ఏపీవో విష్ణాచారి తెలిపారు. మూసాపేట-మహ్మదుస్సేన్‌పల్లి రోడ్డు ఆక్రమణకు గురైందని, సర్వే చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీటీసీ కోరారు. సమావేశంలో ఎంపీటీసీలు ఆంజనేయులు, సత్యనారాయణ, పల్లవి, సంతోషి, సర్పంచులు సాయిరెడ్డి, స్వరూప, నిర్మల, లక్ష్మణ్, ఏఈలు లక్ష్మణ్‌గౌడ్, రాజు, అశోక్, ఏవో రాజేందర్‌రెడ్డి, ఎంపీవో సరోజ తదితరులు ఉన్నారు.