మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18: అందరం కలిసి మెలిసి అడుగులు వేస్తూ అభివృద్ధి చెందిన దేశాలతోపోటీ పడి దేశాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి డప్పులతో రాయల్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి కలిసి మెలిసి మంత్రి జ్యోతిప్రజ్వలన చేశారు. హన్వాడ, కోయిల్కొండతోపాటు పలు కస్తూర్బా గాంధీ, వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రత్యేక నృత్యాలు చేశారు. పలువురు కళాకారులకు మంత్రి, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ ఎస్.వెంకట్రావుతో కలిసి బహుమతులను, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మన తర్వాత స్వాతంత్య్రం సిద్ధించిన ఎన్నో దేశాలు మనకంటే ముందంజలో ఉన్నాయని తెలిపారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ విద్వేషాలను రెచ్చగొడితే రాజ్యం అత్యధిక రోజులు నడుపడం సాధ్యం కాదన్నారు.
ప్రపంచ దేశాలతో పోటీపడుతూ అగ్రగామిగా నిలిపేందుకుగానూ కృషి చేయాలని స్పష్టం చేశారు. కులమతాలను పూర్తిస్థాయిలో రూపుమాపుతూ మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అసవరం ఉందన్నారు. మహనీయుల త్యాగఫలం ఎట్టి పరిస్థితుల్లో వృథా కాకూడదని తెలిపారు. అంతకుముందు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్‌పవర్, జెడ్పీ సీఈవో జ్యోతి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, అదనపు ఎస్పీ రాములు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్‌గౌడ్, హార్టికల్చర్ జిల్లా అధికారి సాయిబాబా, చేనేత జౌళిశాఖ జిల్లా అధికారి బాబు తదితర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.