కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 18 : నెల రోజుల కిందట తన ఇద్దరు పిల్లలను కిరాతకంగా చంపి ఆత్మహత్యాయత్నం చేసి చావుబతుకుల మధ్య పాలమూరు దవాఖానలో చికిత్స పొంది ఇంటికి చేరిన శాడిస్టు భర్తను భార్య గొడ్డలితో నరికి హత్యచేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికళ్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. కుడికిళ్లకు చెందిన ఓంకార్ (35) మొదటి భార్య చనిపోవడంతో రెండో పెండ్లి చేసుకొని ఆమెకూ విడాకులిచ్చాడు. తర్వాత అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని ప్రేమించి మూడో పెండ్లి చేసుకున్నాడు. అయితే మద్యానికి బానిసైన ఓంకార్ తరచూ భార్యతో గొడవపడేవాడు. అతడి తీరు నచ్చక గ్రామస్తులు కూడా అతడితో మాట్లాడేవారు కాదు. అవమానంగా భావించి కొల్లాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ మేస్త్రీ పనులు చేసేవాడు. అయితే గత నెల 17న భార్యాపిల్లలతో కలిసి నాగర్‌కర్నూల్ దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వెళ్తున్న క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
దీంతో మనస్తాపం చెందిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బైక్ దిగి వెళ్లింది. ఇది జీర్ణించుకోలేని ఓంకార్ ఆగ్రహంతో తన ఇద్దరు పిల్లలు విశ్వనాథ్(1), చందన(3)ను ఎత్తం గట్టు వద్దకు తీసుకెళ్లి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత తానూ ఆత్మహత్యాయత్యానికి యత్నించగా.. బాటసారుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓంకార్‌ను చికిత్సనిమిత్తం పాలమూరు దవాఖానకు తరలించారు. చికిత్సతో ఆరోగ్యం బాగుపడ్డ ఓంకార్ శుక్రవారం కుడికిళ్లలోని ఇంటికి చేరుకున్నాడు. పిల్లలు మృతితో కడుపు కోతతో ఉన్న భార్యను వేధింపులకు గురి చేశాడు. దీంతో సహనం కోల్పోయిన మహేశ్వరి శనివారం రాత్రి నిద్రపోతున్న భర్తపై గొడ్డలితో దాడి చేసింది. ఆదివారం కొల్లాపూర్ పోలీసుల ముందు ఆమె లొంగిపోయినట్లు సీఐ యాలాద్రి తెలిపారు. ఈమేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.