నెట్వర్క్ మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9; ‘గణపతి బప్పా మోరియా’.. ‘జైబోలో గణేశ్ మహరాజ్‌కీ జై’.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా దేవా’.. అంటూ భక్తులు వినాయకుడికి ఘన వీడ్కోలు పలికారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 10 రోజుల పాటు పూజలందుకున్న గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు. మహబూబ్‌నగర్, ఊట్కూరు, జడ్చర్లలో శోభాయాత్రలు కనుల పండువగా జరిగాయి. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా. డ్యాన్స్‌లు, దాండియా, బొడ్డెమ్మలు ఆకట్టుకున్నాయి. డీజే మోతల మధ్య పల్లె, పట్నం హోరెత్తాయి. –
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులపాటు భక్తులతో విశేష పూజలందుకున్న గణపయ్యలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఆయా గ్రామాల్లో వినాయక మండపాల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పలుచోట్ల అన్నదాన కార్యక్రమం చేపట్టా రు. మండపాల నిర్వాహకులు లడ్డూ వేలం నిర్వహించారు. పూజలందుకున్న లడ్డూను దక్కించుకునేందు కు భక్తులు పోటాపోటీగా పోటీపడి దక్కించుకున్నారు. ప్రత్యేక వాహనాల్లో గణపయ్యలను ఉంచి శోభాయాత్రలో యువత డ్యాన్స్‌లు, మహిళలు బొడ్డెమ్మలతో అందరినీ ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు వివిధ దేవతామూర్తుల కటౌట్లతో ఏర్పాటు చేసిన డెకరేషన్లు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
బందోబస్తును పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులను ఎస్పీ అభినందించారు. మక్తల్ పట్టణంలోని కేశవనగర్ శబరి కాలనీలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నారాయణపేట మున్సిపల్ వేదికపై వినాయక నిమజ్జనానికి వెళ్తున్న విగ్రహాలకు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రత్యేక పూజులు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. – నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 9