మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 1: గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపొందించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని బతుకమ్మ కానుకగా రూపొందించారు. అమ్మ కావాల్సిన సమయంలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారిలో హిమోగ్లోబిన్ పెంచడానికి పోషకాహార కిట్లు అందించడమే మార్గమని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ ఉన్నాయి. 11,806 మంది గర్భిణులను కిట్‌కు అర్హులుగా గుర్తించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు జిల్లాలోని గట్టు మండలంలో మొదట సర్వే చేయించారు. 90 శాతం మంది గర్భిణులు రక్తహీనతతో ఉన్నట్లు తేలింది. రక్తహీనత ఉన్నవారికి అరటిపండ్లు, గుడ్లు, పల్లీ పట్టీలు, డ్రైప్రూట్స్ అందేలా చూడగా 43శాతానికి తగ్గింది. ఇదే విధానాన్ని అక్కడున్న అన్ని మండలాల్లో అమలు చేయడంపై ఆ జిల్లా అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం పోషకాహార కిట్లను పంపిణీకి జిల్లాను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడంతో గర్భిణులకు అందించనున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోనూ రక్తహీనతతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉన్నారు. పైలట్ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కిట్ విలువ రూ. 2వేలు
రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలను పోషకాహార కిట్ల పంపిణీకి ప్రభుత్వం ఎంపిక చేసింది. గర్భం దాల్చిన సమయంలో అవగాహన లేక, పేదరికంతో చాలా మంది మహిళలు సాధారణ ఆహారం తీసుకుని రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుట్టిన శిశువుపైనా ప్రభావం ఉంటున్నది. అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందజేస్తున్నా పరిస్థితుల్లో అనుకున్న మేరకు మార్పురాని నేపథ్యంలో పోషకాహార కిట్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో కూడిన న్యూట్రిషన్ కిట్ విలువ రూ.2వేలు ఉంటుంది. గర్భిణులకు 3వ, 6వ నెలలో కిట్ అందజేయనున్నారు. వీటితో పోషకాహార లోపం తగ్గడమే కాకుండా సిజేరియన్లు తగ్గుతాయని, మాతా శిశు మరణాలను నియంత్రించొచ్చని సర్కార్ ఈమేరకు చర్యలు చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్..బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తూ అండగా నిలుస్తుందని వైద్యులు పేర్కొన్నారు.