మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 1: చూడచక్కని కొండపల్లి, ఏటి కొప్పాక బొమ్మలు, మగువల మనసు దోచే వెంకటగిరి, పోచంపల్లి చీరలు, హైదరాబాద్ ముత్యాలు , బెంగాల్ జూట్ బ్యాగ్‌లు..కండ్లు మిరుమిట్లు గొలిపే వస్తువులకు పాలమూరు వేదికైంది. జిల్లా కేంద్రంలోని ఎక్స్పో ప్లాజాలో అఖిల భారత హస్తకళ చేనేత ప్రదర్శన కొనసాగుతున్నది. నెల రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శన కొనుగోలుదారుల డిమాండ్‌ను బట్టి దసరా వరకు ప్రదర్శన కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూలై 31న ఈప్రదర్శనను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. దాదాపు రెండు వందల రకాల చేనేత, హస్తకళ వస్తువులను ప్రదర్శిస్తూ అమ్మకాలు సాగిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న చీరలు..
రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, వరంగల్, వెంకటగిరి, ఉప్పాడ పట్టు చీరలు మగువల మనసు దోచుకుంటున్నాయి. బయటికన్న తక్కువ ధరలకు క్వాలిటీ చీరలు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నేతన్నలు తయారు చేసిన చీరలు ఇక్కడ చౌకగా లభిస్తున్నాయి.
కొండపల్లి బొమ్మలు అదుర్స్
ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలు చేనేత ప్రదర్శనలో హైలైట్‌గా నిలిచాయి. కొండపల్లి, నిర్మల్, ఏటికొప్పాక బొమ్మలు హస్తకళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. దీంతో వివిధ రకాల చెక్క బొమ్మలు దొరుకుతున్నాయి. ఈబొమ్మలు ఇంట్లో ప్రత్యేక అలంకరణలకు కొనుగోలు చేస్తున్నారు. నిర్మల్ టాయిస్లు కూడ చౌకగా లభిస్తున్నాయి. హైదరాబాద్ ముత్యాలు, ఫిరోజాబాద్ గాజులు, మైసూరు రోజ్‌వుడ్, వరంగల్‌లో తయారుచేసిన రకరకాల లెదర్ బ్యాగులు ఆకట్టుకుంటున్నాయి. బంజారాలు వాడే ఎంబ్రాయిడరీ వర్క్‌లు కూడా ఉన్నాయి. తినుబండారాలు, రాగి జావలు, అప్పడాలు, నువ్వుల లడ్డు, గుంటూరు పచ్చళ్లు అదిరిపోతున్నాయి. రూ. 5వందల నుంచి రూ. 15వేల దాకా వివిధరకాల ధరల్లో లభిస్తున్నాయి. పట్టణ ప్రజలే కాక వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండటంతో చేనేత ప్రదర్శనను దసరా వరకు పొడిగించినట్లు తెలిపారు.
చాలా బాగున్నాయి..
ప్రదర్శనలో ఉంచి వివిధ రకాల ఫిరోజాబాద్ గాజులు చాలా బాగున్నాయి. ఇవి మార్కెట్లో కంటే తక్కువ ధరకు లభిస్తున్నాయి. రకరకాల డిజైన్లు ఇక్కడే అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి.
– జయమ్మ, ఉపాధ్యాయురాలు, గాధిర్యాల
ఆదరణ బాగున్నది
చేనేత వస్త్ర, వస్తువుల ప్రదర్శనకు ఇంతకుముందుకన్నా ఇప్పడు ఆదరణ బాగున్నది. ఈసారి ఎక్కువ రకాలను ప్రదర్శిస్తున్నాం. కస్టమర్లకు అందుబాటులో ఉన్న ధరలకు అమ్ముతున్నాం. బయట మార్కెట్ రేటు కంటే చాలా తక్కువగా ఉంది.
– దుర్గాప్రసాద్‌రావు,నిర్వాహకుడు