దళితులు, సంక్షేమం, ఉచిత పథకాలు, బడుగులపై బీజేపీ అడుగులకు మడుగులొత్తేలా ఏబీఎన్
అధినేత వేమూరి రాధాకృష్ణ విషం కక్కారు. ప్రధాని మోదీ మార్గంలోనే ఏబీఎన్ మార్క్ కనిపిస్తున్నది. రూ.10 లక్షల పథకమేమిటీ.. అలా పంచుతారా.. అంటూ ఎమ్మెల్సీ కవితతో ఏబీఎన్ బిగ్ డిబేట్లో ఆర్కే చేసిన వ్యాఖ్యలు దళిత ప్రజల్లో ఆగ్రహావేశాలను కట్టలు తెంచుకొనేలా చేసింది. దళితులు ఆర్థికంగా ఎదిగితేనే సామాజికంగా ఎదుగుతారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన బృహత్తర పథకం దళితబంధుపై జర్నలిస్టుగా ఉన్న రాధాకృష్ణ చేసిన మాటలు ఆ మీడియాను ప్రజలు ఈసడించుకొనేలా చేసింది. గతంలోనూ బడుగు నేతలపై బాడుగు నేతలంటూ రాతలు రాశారు. ఉద్యమ ఆకాంక్ష పత్రిక ‘నమస్తే తెలంగాణ’పైనా కూతలు కూశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని దళిత,ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ): ఉచితం, సంక్షేమ పథకాలను బీజేపీ, ప్రధాని మోడీ ప్రభుత్వం ఎత్తేసేలా కుట్రలు చేస్తున్నది. పేదలను, ఎస్సీ,ఎస్టీలు,బీసీలను ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు అమల చేస్తున్నారు. నాయీబ్రాహ్మణులకు, రజకులకు సబ్సిడీపై విద్యుత్, కురుమలకు 75శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు వందశాతం సబ్సిడీతో చేప పిల్లలు, వాహనాలు, కల్లుగీత, బీడీ, చేనేత కార్మికులకు భీమా,వృద్ధ, వితంతు, వికలాంగులకు ఆసరా పింఛన్లు, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పేరుతో రూ.1లక్ష ఆర్థిక సాయం, రైతులకు రైతుబంధు, రైతుభీమాలాంటి పథకాలు అమలు చేస్తున్నారు.
ఈ క్రమంలో దళితుల అభ్యున్నతి కోసం రూ.10లక్షల సాయం అందించేలా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చారకొండలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో 100మంది చొప్పున దళితులకు ఈ పథకం తొలివిడతలో పథకం ఫలాలు అమలవుతున్నాయి. దీనివల్ల దళితులు సొంతకాళ్లపై నిలబడుతున్నారు. ఆర్థికంగా ఎదిగితే సామాజికంగానూ అసమానతలు తొలగుతాయనే ఉద్దేశంతో ఈ పథకం దేశంలో, ప్రపంచంలో లేని విధంగా అమలవుతున్నది. అలాంటి పథకాన్ని కుటుంబానికి 10లక్షలు ఇచ్చేస్తారా, ఎంటి పదిలక్షలు, యాడికెళ్లి తెస్తరంటూ ఏబీఎన్ డిబేట్లో భాగంగా ఎంఎల్సీ కవితను ఇంటర్వ్యూ చేస్తూ రాధాకృష్ణ తన దుష్టత్వాన్ని చాటుకొన్నారు.
తప్పేముందని కవిత ప్రతిస్పందించారు. దళిత బంధులో రూ.10లక్షలు పెట్టి కెమెరా పెట్టుకొన్నా అని ఓ యువకుడు తనతో సంతోషంగా చెప్పారని కవిత దళితబంధు పథకం గొప్పదనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అయినా రాధాకృష్ణ వినకుండా కార్పొరేషన్ ద్వారా ఇప్పించండి, డ్వాక్రా సంఘాల్లో ఇవ్వడం లేదా.., డబ్బులు ఎవరు కడతారు.., మీరు కడతారా అంటూ మోడీ ప్రభుత్వం ఉచితం, సంక్షేమాలు వృధా అని, తీసేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే రాధాకృష్ణ వ్యాఖ్యలు ప్రతిబింబించడం గమనార్హం. ఎమ్మెల్సీ కవిత ఉచిత, సంక్షేమ పథకాల గురించి చర్చిద్దామంటుంటే ఢిల్లీకి వెళ్దామంటూ ఈ అంశంపై చర్చను దాటవేయించారు. దీనిపై దళిత, ప్రజా సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
గ్రామాల్లోకి వచ్చి చూస్తే దళితుల బ్రతుకులు ఎలా ఉన్నాయో, దళితబంధు పథకం వల్ల ఎలా మార్పు వచ్చిందో తెలుస్తుందని నిలదీస్తున్నారు. గతంలో బీసీ నేతలపై బాడుగ నేతలు అనే కథనం ప్రచురించిన విషయాన్ని లేవనెత్తుతున్నారు. రాధాకృష్ణకు దళిత,బడుగు ప్రజలంటే చిన్నచూపని, బీజేపీ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు కంకణం కట్టుకున్నారన్న విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ప్రతిబింబించిన నమస్తే తెలంగాణను సీఎం కేసీఆరే చదవడంటూ ప్రస్తావించడం ఉద్యమకారులు, టీఆర్ఎస్ నేతల్లోనూ విమర్శలకు దారి తీస్తోంది.
ప్రతి నియోజకవర్గంలో వంద మంది చొప్పున ఉమ్మడి పాలమూరులోని అన్ని నియోజకవర్గాల్లో దళితులకు రూ.10లక్షలు ఇచ్చే పథకం ఘనంగా అమలవుతోంది. అలాగే చారకొండలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా 1674మందికి దళితబంధు సాయాన్ని అందజేయనున్నారు. ఇప్పటికే వందలాది మంది దళితబంధు ద్వారా ట్రాక్టర్లు, కార్లు, డైరీలు, ఇతర స్కీంలతో ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పథకం అనుచితమంటూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దళిత,ప్రజా సంఘాల్లో ఆగ్రహావేశాలను ప్రజ్వలిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు ద్వారా తెచ్చిన కారుతో మాకు జీవనాధారం ఏర్పడింది. దళితులపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి మరెవ్వరికి లేదు. దళిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి రూ.10 లక్షలు ఇవ్వడం ఎంతో అదృష్టం. మా కుటుంబానికి బాసటగా నిలిచిన ముఖ్యమంత్రిని, పేట ఎమ్మెల్యే ఎస్.ఆర్‌రెడ్డిని ఎన్నటికీ మరువం.
– వెంకట్రాములు, రాకొండ, మరికల్, నారాయణపేట జిల్లా
దళితబంధు పేదలకు వరంలాంటిది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అమలవుతున్న ఈ పథకం వల్ల కడుపేదలుగా ఉన్న ఎస్సీలు ఆర్థికంగా శక్తిమంతులు అవుతారు. ఇప్పుడిప్పుడే పథకానికి అడుగులు పడుతున్నాయి. ఇలాంటి గొప్ప పథకాన్ని కించపర్చడం ఏబీఎన్ రాధాకృష్ణతో పాటుగా ఎవరికీ న్యాయం కాదు. దళితులకు అమలు చేసే పథకాలను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదరించాలి.
– రాములు, ఎంపీ, నాగర్‌కర్నూల్
గ్రామాల్లోకి వస్తే దళితబంధుతో జరుగుతున్న లబ్ధి ఎలా ఉందో తెలుస్తుంది. కార్లు, ట్రాక్టర్లు నడుపుతూ యజమానులుగా మారారు. బీజేపీ విధానాలకు అనుగుణంగా మాట్లాడటం ఏబీఎన్ రాధాకృష్ణకు సరికాదు. సీఎం కేసీఆర్ దళిత,బలహీన వర్గాల ఇండ్లల్లో దేవుడిలా మారారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, భీమా పథకాలు, దళితబంధు, రైతుబంధులాంటి పథకాలతో రాష్ట్రంలో ప్రజల్లో పేదరికం తగ్గింది. కొనుగోలు శక్తి పెరిగింది.
– పద్మావతి, జెడ్పీ చైర్ పర్సన్, నాగర్‌కర్నూల్
ఏబీఎన్ రాధాకృష్ణకు దళితులు, బీసీలంటే చిన్నచూపు. గతంలో బాడుగ నేతలనే వార్తను రాశారు. మీడియా పేరుతో బ్రాహ్మణ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ఉచిత సంక్షేమ పథకాలు వద్దని చేసే ప్రచారంలో భాగమే రాధాకృష్ణ వ్యాఖ్యలు. రాధాకృష్ణ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. సీఎం కేసీఆర్ బడుగులతో పాటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు దేశంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాధాకృష్ణ తన వైఖరి మార్చుకోకుంటే ఏబీఎన్‌ను తెలంగాణ నుంచి దళిత సమాజం బహిష్కరిస్తుంది.
– మంగి విజయ్, ఎంపీటీసీ, దళిత నేత
తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించడం, వ్యతిరేక కథనాలు రాస్తున్న క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఉద్యమ ఆకాంక్షకు ప్రతీకగా నిలిచింది. నమస్తే తెలంగాణ వచ్చినందుకే ఆంధ్రా యాజమాన్యాలు తమ ఉనికి పోతుందని ఉద్యమ వార్తలకు, సీఎం కేసీఆర్‌కు ప్రాధాన్యత ఇచ్చాయి. అలాంటి దినపత్రికను విమర్శించడం ఓ మీడియా అధినేతగా రాధాకృష్ణకు తగదు.
– బైకని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి
ఏబీఎన్ బిగ్ డిబేట్లో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో దళితబంధు పథకాన్ని అవమాన పరిచే విధంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మాట్లాడడం దళితులను అవమాన పర్చినట్లే. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధుపథకం ప్రవేశపెడితే రాధాకృష్ణ ఈ పథకంపై విషం కక్కుతున్నారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేనట్లుంది. ఇలానే వ్యవహరిస్తే మా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
– రామేశ్వరమ్మ, జోగుళాంబ గద్వాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్
దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని దళితబంధు పథకం ప్రవేశట్టారు. ఒక్క కుటుంబానికి రూ.10లక్షలు ఉచితంగా ఎలా ఇస్తారని మాట్లాడుతున్నాడు దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం అందిస్తే తప్పేమి. రాధాకృష్ణ మాటలు దళితులను అవమానపరిచే విధంగా ఉన్నాయి. వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలి. నమస్తే తెలంగాణ పేపర్ ఉంది కాబట్టే ప్రతిపక్షాల నిజస్వరూపాలు బయట పడుతున్నాయి. రాధాకృష్ణ తన మాటలు వెనక్కి తీసుకోవాలి.
– పూడురు చిన్నయ్య,దళిత సంఘం నాయకులు
తెలంగాణను బద్నాం చేస్తూ మా పథకాలను వెక్కిరిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో మా దళితుల జీవితాలు వెలిగిపోయినట్లు, దానికి మీ ఆంధ్రా నాయకులు మా జీవితాలను మలిచినట్లు ఎందుకు మాట్లాడుతున్నారు. దళితబంధుతో స్వశక్తితో నిలబడి ఒకడి కింద జీతగాళ్లలా కాకుండా మేము సగర్వంగా ఓనర్లుగా మారాం. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలు అని అంటున్నారు అవి ఏ రకంగా ఉచితాలో నీకు దమ్ముంటే మీ పత్రికలో రాయండి లేదంటే పత్రికను తెలంగాణలో నెగులనియ్యం.
– శరవంద, టీఆర్ఎస్ దళిత నాయకుడు, వనపర్తి
దళితులు అంటే పుట్టిన నాటి నుంచి మరణించే వరకు తరతరాలు దరిద్రులుగానే ఉండాలా. ప్రకృతి అందించే అన్నింట్లో లేని వ్యత్యాసం ప్రజల్లో ఉండకూడదనే అందరితో సమానంగా ఎదగాలంటే వారికి ఆర్థిక సహాయాన్ని అందించాలి అప్పుడే వారు సంఘంలో గౌరవంగా బతుకుతారని గొప్ప సంకల్పంతో దళితబంధు పథకాన్ని సీఎం కెసీఆర్ ప్రవేశపెట్టారు. ఎంతో మంది దళితులకు ఇది వరంలాంటిది. ఇలాంటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో లేక ఇన్ని సంవత్సరాలు మరుగునపడ్డాం. సీఎం కేసీఆర్ నాయకత్వాన దళితులు కడుపునిండా ముద్ద తింటూ అందరితో సమానంగా బతుకుతున్నారు.
– పరంజ్యోతి, దళితసంఘం జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
దళితులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దళితబంధు పథకం దళిత జాతి చరిత్రతో గొప్ప పథకం. 60 ఏండ్లుగా పాలకులు దళితుల బాధలను పట్టించుకోలేదు. ఇన్నేండ్లుగా దళితులకు చేసిన సాయం గోరంత, ప్రభుత్వాలు మారతున్నా దళితుల ఆర్థిక పరిస్థితులు, జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. కానీ నేడు సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. లబ్ధిదారుడి ఖాతాల్లో నేరుగా రూ.10 లక్షలు వేస్తున్నారు. తిరిగి చెల్లించనవసరం లేకుండా ఆర్థికంగా ఉపాధి పొందుతున్నాం. చాలా మంది దళితులు ఉపాధి పొందుతున్నాం. దళితబంధుపై విమర్శిస్తే దళితులను కించపరిచడమే. ఇలాంటి పథకంపై విమర్శలు చేస్తే ఎంతంటి వారిపైనైనా పోరాటం చేస్తాం. దళితులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– మల్లేపోగు శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత