వనపర్తి, ఆగస్టు 28 : రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో నూతనంగా మంజూరైన 1,630 ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.
అలాగే 153 మందికి రూ.48.51 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతరం వారితో మంత్రి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రూ.75 పింఛన్ ఇచ్చేవారని, ఇందుకోసం పైరవీలు చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక ఒక్కొక్కరికీ రూ.2,016 చొప్పన అర్హులందరికీ అందజేస్తున్నామని చెప్పారు.
వనపర్తి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 3,240 మంది వృద్ధులు, 2,669 మంది వితంతువులకు, 1,191 మంది వికలాంగులకు, 34 మంది కల్లుగీత, 36 మంది చేనేత కార్మికులు, 137 మంది ఒంటరి మహిళలకు నెలకు రూ.కోటీ 61,21,440 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. 57 ఏండ్లు పైబడిన వారికి పింఛన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధిలో 2 వేల మంది దరఖాస్తు చేసుకోగా 1630 మందికి కార్డులు మంజూరైనట్లు తెలిపారు. మొత్తం 9,016 కుటుంబాలకు రూ.2 కోట్ల వరకు అందిస్తున్నట్లు చెప్పారు.
పింఛన్ జాబితాలో అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించాలని మంత్రి ఆదేశించారు. గాంధీ, ఉస్మానియా కంటే మంచిగా వైద్యం అందేలా రూ.510 కోట్లతో 600 పడకల దవాఖానను నిర్మిస్తామన్నారు. ఎంత పెద్ద జబ్బు వచ్చినా వనపర్తిలో తగ్గేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రూ.700 కోట్లతో మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. దసరా నాటికి 80 శాతం రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతి బాధితుడికి సీఎంఆర్ఎఫ్ సాయం అందజేస్తున్నామని, రాష్ట్రంలోనే వనపర్తి మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
అనంతరం మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, నాయకులు, పింఛన్ లబ్ధిదారులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు., కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, సమద్, కంచె రాఘవేంద్ర, నక్కరాములు, విభూతినారాయణ, బాష్యానాయక్, అలివేల గోపాల్, పుట్టపాకుల మహేశ్, బండారుకృష్ణ, పద్మ శేఖర్, ఉన్నీసాబేగం రహీం, సత్యమ్మ శరవంద, కృష్ణయ్య, చంద్రకళ కృష్ణయ్య, సత్యనారాయణ, నందిమల్ల భువనేశ్వరి శ్యాం, కదిరె జంపన్న, లక్ష్మీదేవమ్మ, మంజుల గోపాల్‌యాదవ్, భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నాగన్న యాదవ్, అలేఖ తిరుమల్ పాల్గొన్నారు.
వనపర్తి, ఆగస్టు 28 : నిరంతరం అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలని, అప్పుడే మరింత ఉత్సాహంగా పని చేయడానికి వీలుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని 29వ వార్డు కౌన్సిలర్ భారతి ప్రేమ్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 250 మంది యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణకు యువశక్తి అవసరమన్నారు. అనంతరం వార్డులో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, పట్టణాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.