తిమ్మాజిపేట, ఆగస్టు 28 : ఉమ్మడి రాష్ట్రంలో ఒకరిద్దరు సీఎంలు ప్రజలకు గుర్తుంటారు.. సీఎం కేసీఆర్ మాత్రం ప్రజల గుండెల్లో నిలిచారు.. అని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సీఎంగా ఆయన చరిత్రలో నిలుస్తారన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కొత్త ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.
పేదవాడికి, రైతులకు భరోసానిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆడబిడ్డల తల్లిదండ్రులకు గుండెబరువు తగ్గించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఆసరా పింఛన్లతో వృద్ధులు ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌవరంగా బతుకుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ప్రజలే ఎజెండాగా సీఎం కేసీఆర్ పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అధికారమే ఎజెండాగా కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు.
వారు కడుపు మంటతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని బీజేపీ చూస్తున్నదని ధ్వజమెత్తారు. అనంతరం 89 మందికి ఆసరా పింఛను, 35 మందికి కల్యాణలక్ష్మి, 14 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, తాసిల్దార్ సరస్వతి, ఎంపీడీవో భాస్కర్, వైస్‌ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కిల్లె మల్లయ్య, ఎంపీటీసీ లీలావతి, కో ఆప్షన్ సభ్యులు రజాక్, మార్కెట్ డైరెక్టర్లు హుస్సేని, కవిత, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వెంకటస్వామి, స్వామి పాల్గొన్నారు.