మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 28 : కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో పలువురు చేరారు. టూ వీలర్స్, బైక్ మెకానిక్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్‌కుమార్, సురేందర్, పట్టణ అధ్యక్షుడు సిద్ధేశ్వర్, సభ్యులు కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, జాజిమొగ్గ నర్సింహులు ఆధ్వర్యంలో 200 మంది గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, ఉచిత విద్యుత్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తూ అండగా నిలిచారన్నారు.
కులమతాలకు అతీతంగా ప్రజలంతా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ సర్కార్‌ను ఆదరిస్తున్నారని చెప్పారు. నాడు గ్రామాల్లో ఒకటో, రెండో బైక్‌లు ఉండేవని, నేడు ప్రతి ఇంటికీ రెండు వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీంతో మెకానిక్‌లకు ఉపాధి అవకాశలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కుల, మతాల పేరిట విద్వేషాలు సృష్టించాలని చూసేవారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పార్టీలో చేరిన వారికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు., కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రాష్ట్ర గొర్రెల కాపారుల సంక్షేమం సంఘం చైర్మన్ బాలరాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మత్స్యకార సహకార సంఘం జిల్లాధ్యక్షుడు సత్యనారయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహ్మాన్, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి వినోద్, గోపాల్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సుభాష్ పాల్గొన్నారు.