పాలమూరు, ఆగస్టు 28 : గొల్లకురుమల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ జిల్లా చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో గొర్రెలను పోషించేందుకు సంచార జీవనం సాగిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తిదారులకు అండగా నిలిచి అన్నివిధాలా ఆదుకుంటున్నదని తెలిపారు. ప్రభుత్వ పథకాలతో కులవృత్తిదారుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు.
గొల్లకురుమల సంక్షేమానికి ప్రభుత్వం రూ.11వేలకోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అంతేకాక యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతోపాటు వృద్ధులకు పింఛన్లు, రైతన్న సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో యాదవుల కోసం రూ.5కోట్లతో యాదవ భవన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
గ్రామాల్లో గొల్లకురుమలకు కమ్యూనిటీహాళ్లు నిర్మించడంతోపాటు అర్హులందరికీ సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకు మరిన్ని యూనిట్ల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అంజయ్య, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గొర్రెల పెంపకందారుల సహకార యునియన్ అధ్యక్షుడు బాలరాజుయాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటనర్స య్య, లక్ష్మీనర్సింహయాదవ్, జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, మత్య్సకారుల జిల్లా సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్, ఆగస్టు 28 : ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యూవిజన్గార్డెన్లో ఏర్పాటు చేసిన ‘పత్రీజీ ధ్యాన విజయం’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ధ్యాన పిరమిడ్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. పిరమిడ్ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మహేశ్వర మహా పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, స్వామిగుప్తా, రాజేందర్‌గౌడ్, ఆంజనేయులు, చెన్నకేశవులు ప్రవీణ్‌కుమా ర్, సూర్యప్రకాశ్, సత్యనారాయణ, రాజు, లలిత, కిరణ్, మౌనిక, నాగరాజు. మహిపాల్, వీరస్వామి పాల్గొన్నారు.