మహబూబ్‌నగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ పనిచేస్తున్న నాన్‌టీచింగ్ సిబ్బందికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. దీనికి పీయూ కమిటీ ఆమోదం తెలిపింది. కేవలం సిఫార్స్ లెటర్లతో నియమితులైన వారిలో అవసరమైన వారికి పరీక్షలు.. మిగతా వారికి నామమాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కాగా ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. అయితే వీరికి ఔట్ సోర్సింగ్ గుర్తింపునిచ్చి ప్రభుత్వ జీవో ప్రకారం వేతనాలు అందించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు.
పాలమూరు యూనివర్సిటీలో నాన్‌టీచింగ్ సిబ్బందికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వేతనాలిచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుంచి వివిధ విభాగాల్లో అవసరమున్న సిబ్బందిని వైస్ చాన్స్లర్లు, పీయూ కమిటీ నియమించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సులతో సిబ్బంది నియామకాన్ని తాత్కాలికంగా చేపట్టారు. ప్రభుత్వం ప్రతి ఏటా యూనివర్సిటీకి ఇస్తున్న గ్రాంట్ లో వీరందరికీ వేతనాలు చెల్లిస్తున్నారు.
అయితే, తాజాగా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సిబ్బందికి పీఆర్సీ సిఫార్సుల ప్రకారం 30 శాతం వేతనాలు పెంచాలని నిర్ణయించింది. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. పీయూలో 152 మంది డ్రైవర్లు, అటెండర్లు, డేటా ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మరికొందరు జూనియర్ అసిస్టెంట్లుగా ఉన్నారు. అయితే, వీళ్లంతా రెకమెండేషన్పై వచ్చిన వారే. దీంతో వారి జాబితా పీయూలో మాత్రమే ఉన్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ కింద నమోదయ్యారు.
దీంతో వీరందరికీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఫలితాల ప్రకారం కేటగిరీలుగా విభజించి వేతనాలివ్వాలని ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై పీయూ వీసీ నియమించిన కమిటీ కూడా ప రీక్షలు నిర్వహించాలని తేల్చింది. దీంతో ఈ సమస్య పీయూకే ‘పరీక్ష’గా మారింది. ఉన్నతాధికారుల సూచన ల మేరకు పరీక్షలు పెట్టి వేతనాలు పెంచాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించా రు. పరీక్షలు నిర్వహిస్తే ప్రతిభ ఆధారంగా కేటగిరీలు మా రడమే కాకుండా గౌరవ ప్రదమైన వేతనాలు దక్కుతాయని.. ఉన్నత విద్యాశాఖ ఉద్యోగుల జాబితాలో స్థానం లభిస్తుందని వీసీ చెబుతున్నారు.
ఒక్కరూ పర్మినెంట్ కాలేదు..
2014 కంటే ముందు నుంచి ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 11 వేల మందిని సీఎం కేసీఆర్ పర్మినెంట్ చేశారు. విచిత్రమేమిటంటే 2008లో పీయూ ఏర్పడింది. అప్పటినుంచి అనేక మంది పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరూ పర్మినెంట్ కాలేదు. దీనిపై వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ విచారించగా, వీరంతా ఔట్సోర్సింగ్ కిందకు రాలేదని తేలింది. పీఆర్సీ అమలు చేయాలన్నా.. తగిన ఆధారాలు లేకపోవడంతో మంత్రి చొరవతో పరీక్షలకు సిద్ధమవుతున్నది.
జరిగింది ఇదీ..
తమకు కూడా పీఆర్సీ వర్తింపజేయాలని నాన్‌టీచింగ్ సిబ్బంది మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వినతి అందజేశారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్‌కు విషయాన్ని వివరిస్తూ మంత్రి లేఖ రాశారు. నవీన్‌మిట్టల్ పీయూ వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ను వివరణ కోరారు. 152 మందికి పీయూ బడ్జెట్ నుంచి వేతనాలు చెల్లిస్తున్నామని, వారిని నియమించినట్లు ఎలాంటి ఆర్డర్ కాపీ లేదని వీసీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇంతమందిని రెకమెండేషన్పై నియమించినట్లు తెలిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, పరీక్షలు రాసేందుకు మెజార్టీ ఉద్యోగులు ఒప్పుకున్నారు. కొంత మంది నిరాకరించిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు విన్నవించారు. దీంతో మంత్రి నవీన్‌మిట్టల్‌తో మాట్లాడారు. పరీక్షలు నిర్వహించినా.. ఏ ఒక్కరినీ తొలగించొద్దని, అందరికీ పీఆర్సీ అమలు చేయాలన్నారు. ఈ మేరకు నవీన్‌మిట్టల్ వీసీని ఆదేశించారు. కాగా, 26 మంది పరీక్షలు నిర్వహించొద్దని కోర్టుకు వెళ్లారు. సముఖంగా ఉన్న వారితోనే పరీక్ష రాయించాలని పీయూ పరిపాలన కమిటీ తాజాగా తీర్మానించింది. ఈ వ్యవహారంలో యూనివర్సిటీని బదనాం చేస్తున్న వారిపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.
పరీక్షలను వ్యతిరేకించడం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు తేలింది. నాన్‌టీచింగ్ సిబ్బందిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా నియమితులైన చాలా మందికి కంప్యూటర్ పరిజ్ఞానమే లేదు. మరికొంతమందికి విద్యార్హతలు కూడా తక్కువ ఉన్నాయి. ఇంకొంతమంది చదువులకు.. చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదు. పీజీ, డిగ్రీలు చేస్తున్న వారు కూడా తక్కువ వేతనం తీసుకుంటున్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించి ప్రతిభకు తగిన వేతనాలివ్వాలని నిర్ణయించారు. ఔట్‌సోర్సింగ్‌లో ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అటెండర్లకు రూ.15,500, డ్రైవర్లు, ల్యాబ్ అసిస్టెంట్లకు రూ.19,500, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.21,500 వేతన కేటగిరీలుగా విభజించి గుర్తింపు ఇవ్వాలని వీసీ, కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత పీఆర్సీ అమలు చేస్తే జీతాలు పెరుగుతాయని కమిటీ
అభిప్రాయపడింది.
ఎవ్వరినీ తొలగించం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలమూరు యూనివర్సిటీలో పనిచేస్తున్న 152 మందికి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కండెక్ట్ చేస్తాం. ఇందులో పాస్, ఫెయిల్ ఉండదు. విద్యార్హతలు, పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా తగిన గౌరవం ఇస్తాం. ఏ ఒక్కరినీ తొలగించం. గతంలో ఔట్సోర్సింగ్ కింద వీళ్లంతా పరిగణలోకి రానందుకే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రికి ఇదే వివరించాం. కొంతమంది దీనిపై అపోహలు సృష్టిస్తున్నారు. ఇది సరైంది కాదు. ఉద్యోగులకు తగిన గౌవరం ఇవ్వాలన్నదే పీయూ పరిపాలన కమిటీ నిర్ణయం.
– లక్ష్మీకాంత్ రాథోడ్, పీయూ వీసీ