ఉండవెల్లి, ఆగస్టు 25: అభివృద్దిలో అలంపూర్ నియోజకవరాన్ని అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే, ఆయన కుమారుడికి తక్షణమే క్షమాపణ చెప్పి పాదయాత్ర నిర్వహించాలని టీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రలో భాగంగా ఎర్రవల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే అబ్రహం, ఆయన తనయుడు అజయ్‌పై దళితబంధు, ఇసుక మాపియాపై చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరాపురం రమణ, వడ్డేపల్లి జెడ్పీటీసీ రాజు, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి, దళితబంధు లబ్ధిదారుల ఆధ్వర్యంలో అలంపూర్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుక మాఫియా, దళితబంధు యూనిట్ల కేటాయింపులో కమీషన్లు తీసుకున్నట్లు నిరూపిస్తే తమ పదవుల రాజీనామాకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అలంపూర్, ఆగస్టు 25: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలా నిజానిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే అబ్రహంపై ఆరోపణలు చేయడం తగదని, నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు ఆయా వ్యక్తుల గురించి తెలుసుకొని మాట్లాడాలని మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి అన్నారు. గురువారం అలంపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు జైలన్బీ, లక్ష్మీదేవమ్మ, సుదర్శన్‌గౌడ్, పార్టీ నాయకులు శేక్ హుస్సేన్‌వలీ, దేవరాజు, మద్దిలేటి, హరిబాబు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
అయిజ, ఆగస్టు 25: అహంకారంతో మాట్లాడి స్థాయిని దిగజార్చుకోవద్దని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. ఎమ్మెల్యే అబ్రహం, ఆయన తనయుడు అజయ్‌పై షర్మిల చేసిన వాఖ్యలపై గురువారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు ధ్వజమెత్తారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యేపై వాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే ఎమ్మెల్యే అబ్రహం, అజయ్‌కు బహిరంగ క్షమాపణలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్వీ నాయకులు మల్లికార్జున్, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, మారెప్ప, మహేంద్ర, దేవసాయం, లోకరాజు పాల్గొన్నారు.
ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 25: షర్మిల బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎర్రవల్లి దళితులు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసీ డిమాండ్ చేశారు. షర్మిల పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే అబ్రహంపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. షర్మిల వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని లేదంటే, పాదయాత్రను అడ్డుకుంటామని ఎర్రవల్లి దళితులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రభుదాసు, రవి, ప్రేమ్, ఎర్రన్న, మంద వెంకటేశ్, కృష్ణ, రవీందర్, ఈరన్న, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.