మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;రాష్ట్ర ప్రభుత్వం మరింత మందికి ‘ఆసరా’ కల్పించింది. వృద్ధాప్య పింఛన్లకు వయోపరిమితి తగ్గించింది. పంద్రాగస్టు నుంచి 57 ఏండ్లు దాటిన లబ్ధిదారులకు పంపిణీని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో మంత్రి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ కూడా జెండా పండుగ రోజు నుంచే శ్రీకారం చుట్టారు. దీంతో కొత్తగా 91,904 మందికి పింఛన్లు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకోగా.. తమకు కొండంత ఆసరాగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
మహబూబ్‌నగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వృద్ధాప్య పింఛన్లకు వయోపరిమితి 57 ఏండ్లకు తగ్గించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమందికి లబ్ధి చేకూరనున్నది. వీరందరికీ ఇప్పుడున్న లబ్ధిదారులతోపాటు ఆసరా పింఛన్ అందనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 15న హైదరాబాద్‌లో కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, విప్ గువ్వల బాలరాజు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ ఆసరా కార్డులు అందజేశారు. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 91,904 మందికి లబ్ధి చేకూరనున్నది. అధికారులు తయారు చేసిన లబ్ధిదారుల జాబితాను గతంలో ప్రభుత్వానికి సమర్పించారు. ఇటీవల తుదిజాబితా ఆయా మండలాలకు చేరుకున్నది. ఈ లిస్ట్ ఆధారంగా కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందనున్నాయి. దీంతో లబ్ధిదారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మండలాలకు చేరిన లిస్ట్..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన ఆసరా పింఛన్‌దారుల జాబితా మండలాలకు చేరుకున్నది. ఆయా మండల పరిషత్ అధికారులకు గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను కలెక్టర్లు పంపించారు. డీఆర్డీఏ అధికారులు సిద్ధం చేసిన జాబితాలను కలెక్టర్లు పరిశీలించి ఆమోదముద్ర వేశారు. దీంతో గ్రామాల వారీగా ఆసరా కార్డులను కూడా ముద్రించి పంపిణీ చేయనున్నారు.
మాట నిలబెట్టుకున్న సర్కార్
తెలంగాణ రాక ముందు పింఛన్లు రావాలంటే ఎవరైనా చనిపోవాలి.. అప్పుడే కొత్త వారికి అవకాశం వచ్చేది. రూ.200 కూడా ఆర్నెళ్లకోసారి ఇచ్చేవారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ వృద్ధులు, వితంతుల పింఛన్‌ను రూ.2 వేలు చేశారు. ప్రతినెలా ఠంఛన్‌గా లబ్ధిదారులకు అందుతున్నది. ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పోస్టాఫీసుల ద్వారా అందిస్తున్నారు. దివ్యాంగులకు, చేనేత, బీడీ కార్మికులతోపాటు వివిధ వర్గాలకు కూడా పింఛన్ ఇస్తున్నది. ఇటీవల డయాలిసిస్ పేషెంట్లకు కూడా లబ్ధి చేకూర్చనున్నట్లు ప్రకటించారు. వృద్ధుల పింఛన్‌కు వయోపరిమితి కూడా తగ్గించడంతో లబ్ధిదారుల్లో సంతోషం నెలకొన్నది. కాగా, ఆసరా పింఛన్ల కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి. వీటిని అధికారులు పరిశీలించి అర్హులను గుర్తించారు. కొంతమంది అర్హులుగా ఉన్నా ఆధార్‌లో వయస్సు తప్పుగా ఉన్నది. అలాంటి వారిని ఫిజికల్‌గా విచారించి అర్హులుగా తేల్చారు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో 22,796, జోగుళాంబ గద్వాలలో 16,123, నాగర్‌కర్నూల్‌లో 23,486, వనపర్తిలో 16,023, నారాయణపేట జిల్లాలో 13,476 మందిని ఎంపిక చేశారు.
చాలా సంతోషంగా ఉన్నది..
నాకు కొత్తగా పింఛన్ మం జూరు కావడం చాలా సంతోషంగా ఉన్నది. 57 ఏండ్లు నిండిన ప్రతి ఒక్క అర్హుడికి పిం ఛన్ అందిస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన మాటకు కట్టుబడ్డారు. ఆ నిర్ణయం నా లాంటి వారికి అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి.
– పుల్లయ్య, పెబ్బేరు
కుటుంబానికి ఆసరా
భర్తను కోల్పోయి రెండేండ్లుగా దీనస్థితిలో బతుకుతున్నా. ఇద్దరు పిల్లలను పోషించుకోలేక ఇబ్బందులు పడేదాన్ని. తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ ఇచ్చి అండగా నిలిచింది. కొత్తగా ప్రకటించిన పింఛన్ జాబితాలో నా పేరు వచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– కె.రాజేశ్వరి, కొత్తకోట