ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరుగుతున్నది. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 10గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో జూరాలకు బుధవారం సాయంత్రానికి 77,754 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయానికి 76,122 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదై నీటినిల్వ 882 అడుగులకు చేరింది.
అమరచింత, ఆగస్టు 3: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల రిజర్వాయర్‌కు వరద స్వల్పంగా పెరిగింది. బుధవారం సాయంత్రానికి 77,754 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా విద్యుదుత్పత్తికి 44,047 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. భీమా లిఫ్ట్-1కు 650, భీమా లిఫ్ట్-2కు 750, కుడి కాలువ 469, ఎడుమ కాలువకు 1,060 క్యూసెక్కులు వరదనీరు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తంగా 47,270 క్యూసెక్కుల వరదనీరు దిగువకు వదులుతున్నట్లుగా ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
తుంగభద్ర డ్యాం 10 గేట్లు ఎత్తివేత
అయిజ, ఆగస్టు 3: కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో టీబీ డ్యాంకు వరద నిలకడగా చేరుతున్నది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 70,586 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 61,285 క్యూసెక్కులు ఉంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.796 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికిగానూ, ప్రస్తుతం 1631.75 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఎగువన ఉన్న తుంగభద్ర డ్యాం నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నీరు నిలకడగా చేరుతోంది. ఆనకట్టకు ఇన్‌ఫ్లో 1,30,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 1,29,600 క్యూసెక్కులు నమోదైంది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 400 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 13.8 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
882అడుగులకు చేరిన శ్రీశైలం
శ్రీశైలం, ఆగస్టు 3: కృష్ణానది ఎగువ పాంత్రాల్లో వర్షాలు కురవడంతో శ్రీశైల జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతున్నది. బుధవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి ద్వారా 41,830, సుంకేసుల నుంచి 1,34,304, హంద్రీనివా నుంచి 250 క్యూసెక్కుల నీరు విడదల కాగా సాయంత్రానికి జలాశయానికి 76,122 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా నమోదైంది. అదే విధంగా ఏపీ పవర్‌హౌస్‌లో 32,371, టీఎస్ పవర్‌హౌస్‌లో 31,784 క్యూసెక్కుల నీటితో విద్యుదుత్పత్తి చేసి దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.30 అడుగులు ఉండగా పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200.6588 టీఎంసీలుగా ఉన్నాయి.