మల్దకల్, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మేకలసోంపల్లిలో రూ.10లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం, ప్రాథమిక పాఠశాలలో అదనపు గది నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి భవిష్యత్‌లో ఉన్నతస్థానంలో ఉండేవిధంగా ఉపాధ్యాయులు కృషిచేయాలని కోరారు. అలాగే మండలంలోని బిజ్వారం నుంచి అడవిరావు చెర్వు, బిజ్వారం నుంచి మంగంపేటను కలుపుతూ మట్టిరోడ్డు పనులను ఎమ్మెల్యే బండ్ల ప్రారంభించారు.
రైతులు బాట కోసం ముందుకు రావడం హర్షించ దగ్గ విషయమన్నారు. 25 ఫీట్ల రోడ్డును వేసుకోవాల్సిందిగా కోరాడు. ఎదురెదురుగా ఇతర వాహనాలు వచ్చినా ఇబ్బందులు లేకుండా బాటను తయారు చేసుకోవాలని రైతులను కోరారు. ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.12 లక్షలు కేటాయిచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకటన్న, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, టీచర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం నుంచి హజ్‌యాత్రకు వెళ్తున్న యాత్రికులకు ప్రభుత్వం తరఫున టీకాలు వేసే కార్యక్రమం చేపట్టగా.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం యాత్రికులకు ట్రావెల్బ్యాగ్, సర్టిఫికెట్ అందజేశారు. యాత్రకు వెళ్లే వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా క్షేమంగా యాత్ర పూర్తి చేసుకొని రావాలని సూచించారు. సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 12 మంది లబ్ధిదారులకు రూ.8.15లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. దవాఖానలో చేరిన రోగులకు ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నగదు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మైనార్టీ మతపెద్దలు, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, కౌన్సిలర్లు, నాగిరెడ్డి, శ్రీనివాసులు, కృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.