ఇటిక్యాల, జూన్15: కృష్ణానదికి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. బీచుపల్లి క్షేత్రంలో వేసవికాలం కావడంతో నదీప్రవాహం పూర్తిగా ఎండిపోయి వాగును తలపిస్తూ ప్రవహిస్తున్న కృష్ణమ్మకు బుధవారం స్వల్పంగా వరద పెరిగింది. భారీ వర్షాలు కురవకపోయినా ఎగువన నుంచి వస్తున్న వరదకు నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలేగాక బీచుపల్లి క్షేత్రానికి వచ్చే పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మానవపాడు, జూన్ 15: మంగళవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని ఆయా గ్రామాల్లో అర్ధరాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం తెల్లవారుజామువరకు కురిసింది. 36.2 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. రాత్రి కురిసిన వర్షం విత్తనాలు విత్తుకునేందుకు అనువుగా ఉండడంతో ఆయా గ్రామాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న, కందులు విత్తుకున్నారు. ఏరువాక మరుసటి రోజే వర్షం కురవడంతో రైతులు ఉత్సాహంగా విత్తనాలు విత్తుకున్నారు.
అయిజ, జూన్ 15: కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు ఇన్ ఫ్లో స్వల్పంగా కొనసాగుతున్నది. బుధవారం ఇన్‌ఫ్లో 709 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 292 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 100.855 గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యానికిగానూ ప్రస్తుతం 40.451 టీఎంసీల నీటినిల్వ ఉంది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికిగానూ ప్రస్తుతం 1612.59 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో స్వల్పంగా కొనసాగుతున్నది. బుధవారం ఆనకట్టకు 153 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, ప్రధాన కాల్వకు 219 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 162 క్యూసెక్కులు కన్స్ట్రక్షన్ స్లూయిస్ నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 4.8 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.