ఉండవెల్లి, జూన్ 15: దేశంలో కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలం కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బీసమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలవారీగా మండలస్థాయి అధికారులు తమ శాఖల నుంచి ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రజాప్రతినిధులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీలకతీతంగా ఉచితంగా 24గంటల విద్యుత్ ఇవ్వడంతో పాటు, రైతుబీమా, రైతుబంధును సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులకు వివరించారు. అలాగే ఇండ్లులేని నిరుపేదలకు త్వరలో ఖాళీ స్థలం ఉన్నవారికి రూ.3లక్షలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించడంలో సర్పంచులు కీలకపాత్ర వహిస్తున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వర్షాలు సకాలంలో కురవాలంటే హరితహారంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో భాగంగా 1180మందికి పాఠశాలలో ప్రవేశం కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా జూలై నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు మనఊరు-మనబడి కార్యక్రమం అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేయడం జరుగుతుదని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, వైస్‌ఎంపీపీ దేవన్న, తాసిల్దార్ వీరభద్రప్ప, ఆయా శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.