నవాబ్‌పేట, జూన్ 15: రోడ్డు విస్తరణలో భాగంగా మండల కేంద్రంలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితుల ఇండ్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవాబ్‌పేట ఉన్నత పాఠశాల నుంచి గొల్లగేరి వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణకు సహకరిస్తున్న ఇండ్ల యజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వమే ప్లాటు కేటాయిస్తుందని, మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లలో వారికి ఇల్లు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న వ్యక్తిగత డబుల్బెడ్రూం ఇండ్లలో రూ.3లక్షలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. నవాబ్‌పేట వ్యవసాయ మార్కెట్ యార్డును ఆధునీకరించనున్నట్లు స్పష్టం చేశారు. నూతనంగా మార్కెట్ యార్డులో సీసీ ఏర్పాటు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతామన్నారు.
మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాను సుందరంగా మార్చి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్‌విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, రైతుబంధు మండల కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీ రాధాకృష్ణ, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సీనియర్ నాయకులు పట్లోళ్ల నాగిరెడ్డి, ప్రతాప్, మెండె శ్రీను, సంజీవరెడ్డి, నర్సింహులు, మెండె అంజయ్య, గండు తిరుపతయ్య పాల్గొన్నారు.