వనపర్తి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : పేదలకు ఉచితం గా బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు కిలోకు రూపాయి చొప్పున చెల్లించేవా రు. జూన్ నెలకు సంబంధించిన రెగ్యులర్ రేషన్ బియ్యాన్ని ఈ నెల 15 వరకు పంపిణీ చేశారు. అదనపు బియ్యాన్ని ఈ నెల 18 నుంచి పేదలకు అందజేయనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సం బంధించిన కోటాను నిల్వ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు, డీఎంలకు ఆదేశాలు అందాయి. కొవిడ్ సమయంలో ఉచితంగా పంపిణీ చేసినట్లుగానే ప్రస్తుతం కూడా సరఫరా చేయనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 9. 37 లక్షల రేషన్ కార్డులున్నాయి. ఇందులో అంత్యోదయ, అన్నపూర్ణతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉన్నాయి. వనపర్తి జి ల్లాలో 1,57,244 రేషన్ కార్డులు ఉండగా 3,318.813 మె ట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకీ అవసరమున్నది.
జోగుళాంబ గద్వాలలో 1,60,571 కార్డులకు 3,525.553 మెట్రిక్ టన్ను లు, నారాయణపేటలో 1,40,215 కార్డులకు 3,280.536, నాగర్కర్నూల్లో 2,38,876 కార్డులకు 4,929.085, మహబూబ్నగర్ జిల్లాలో 2,40,594 కార్డులకు 5,227.093 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. వీటిని కేవలం 9 రోజుల్లో అందజేయనున్నారు. ఇప్పటికే స్టాక్పాయింట్ల వద్ద నుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, జూన్ 15 వరకు పంపిణీ చేసిన డీలర్లు.. 18వ తేదీ నుంచి మళ్లీ బియ్యం పంపిణీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. అదనపు బియ్యంపై సరైన ప్రచారం కల్పించాల్సి ఉన్నది. లేకుంటే అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే అవకాశమున్నది.
ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నది. ఈ అవకాశాన్ని రేషన్ కార్డుదారులు వినియోగించుకోవాలి. ఈ నెల 18 నుంచి 26 వరకు బియ్యం అందజేయనున్నారు. ఐదు కిలోల బియ్యానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు విషయాన్ని గమనించాలి. బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం.
– వేణుగోపాల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), వనపర్తి