బాలానగర్, జూన్ 15: బాలానగర్ మండల కేంద్రంతో పాటు పెద్దరేవల్లి, గౌతాపూర్, మోతీఘణపూర్, పెద్దాయపల్లి, గుండేడ్, సురారం తదితర గ్రామాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురువడంతో చెరువులు, వాగులు, కుంటల్లోకి భారీ వరద చేరింది. వరద ఉధృతంగా ప్రవహించడంతో రోడ్లపై నీరు పారి రాకపోకలు నిలిచిపోయాయి.
మండల కేంద్రంలోని పెద్ద చెరువు, చిన్న చెరువు, పెద్దరేవల్లిలో కుమ్మరికుంట, పీర్ల చెరువు నిండి రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గౌతాపూర్లో చిలాల్ సాబ్చెరువు, మోతిఘణపూర్లో రోడ్డు పైకి నీళ్లు రావడంతో గుర్తు తెలియని కారు కొట్టుకుపోయింది. వరద తగ్గాక గ్రామస్తులు కారును బయటకు తీశారు. సూరారం వాగు పొంగడంతో ఉడిత్యాల-సురారం గ్రామస్తులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంలో దుందుభీ వాగు, పెద్ద చెరువు పారడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. కొందరు చెరువు వద్ద పూజలు చేశారు.
జడ్చర్ల, జూన్ 15: జడ్చర్ల మున్సిపాలిటీతోపాటు మండలంలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యరాత్రి నుంచి ఉదయం 10గంటల వరకు వర్షం కురవడంతో జడ్చర్ల మున్సిపాలిటీలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మురుగునీరు జడ్చర్ల-నాగర్కర్నూల్ ప్రధాన రహదారిపై చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం దాదాపు 57మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జడ్చర్ల వ్యవసాయశాఖ అధికారి గోపీనాథ్ తెలిపారు. వర్షం మెట్టపంటల సాగుకు అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. మూడునాలుగు రోజుల పాటు విత్తనాలు విత్తుకోవడానికి అనువుగా ఉంటుందన్నారు.
తొలకరి వర్షం కురవడంతో రైతులు తమతమ పొలాల్లో బిజీబిజీగా ఉన్నారు. విత్తనాలు విత్తేపనిలో నిమగ్నమయ్యారు. ఇదివరకే విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్న అన్నదాతలు భారీ వర్షానికి పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న సాగుచేస్తున్నారు. రైతులు తుకాలు పోసేందుకు భూమిని చదునుచేస్తున్నారు.