కల్వకుర్తి, జూన్ 9: రైతుల సంక్షేమం కోసం సహకార బ్యాంకులు పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. పట్టణంలోని పీఏసీసీఎస్ కార్యాలయ ఆవరణలో రూ.80లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనానికి జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, వైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ భరత్‌ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యంతో కలిసి ఎమ్మె ల్యే శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి పీఏసీసీఎస్ చైర్మన్ తలసాని జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
అభివృద్ధిలో కల్వకుర్తి పీఏసీసీఎస్ ముందంజలో ఉంటూ రైతుల కోసం పనిచేయడం సంతోషదాయకమన్నారు. రైతుల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సహకార బ్యాంక్ రాయితీతో కూడిన రుణాలను ఇస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనకుండా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.
కల్వకుర్తిలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలోని గోదాం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాన్ని ఇచ్చే విధంగా కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. అంతకు ముందు డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం ధీర్ఘకాలిక, స్వల్ప కాలిక, పంట రుణాలు, గొర్రెలు, మేకలు, పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రమ వంటి వాటికి రాయితీతో కూడిన రుణాలను ఇస్తున్నామని చెప్పారు. గోదాంల నిర్మాణానికి 25శాతం, మహిళలకు 35 శాతం రాయితీతో రుణాలు ఇస్తున్నామని ఆయన తెలిపారు. సహకార బ్యాంకులు ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని, రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి పాటుపడాలని డీసీసీబీ చైర్మన్ రైతులకు సూచించారు.
అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం కల్వకుర్తి సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.3కోట్ల 50లక్షల ఎల్టీ రుణాలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోహర, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీశైలం, వైస్ చైర్మన్ షాహెద్, పీఏసీసీఎస్ వైస్ చైర్మన్ శ్యాం, రంగాపూర్ పీఏసీసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్లు బాలయ్య, సంబు పుల్లయ్య,అనిల్‌కుమార్‌రెడ్డి, సీఈవో వెంకట్‌రెడ్డి, పీఏసీసీఎస్ డైరెక్టర్లు రాజవర్దన్‌రెడ్డి, బన్నె శ్రీను, శ్రీనివాసరావు, రైతులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
వెల్దండ, జూన్ 9 : గ్రామీణ రహదారుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని గాన్‌గట్టుతండా వద్ద రూ.4.15కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనుల ప్రారంభానికి గురువారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ చెర్కూర్ గేటు నుంచి గాన్‌గట్టుతండా వరకు రూ. 8కోట్లతో బీటీ వేసినట్లు తెలిపారు. రహదారి ,బ్రిడ్జి ఏర్పాటుతో గిరిజన తండాల ప్రజల రాకపోకలకు మార్గం ఎంతో సుగమం అవుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శాంతిగోపాల్నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, సర్పంచ్ పత్యానాయక్, నాయకులు జైపాల్‌నాయక్, ఎండీ ఆలీ, నారాయణనాయక్, చెర్కూర్ ఉప సర్పం చ్ నర్సింహముదిరాజ్, బర్కత్‌పల్లి ఉపసర్పంచ్ నర్సింహ, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి, డిప్యూటీ ఈఈ దుర్గాప్రసాద్, ఆనంద్‌రెడ్డి , జంగయ్య ఉన్నారు.
కల్వకుర్తి,జూన్ 9: మున్సిపాలిటీలోని తిమ్మరాశిపల్లిలో నిర్వహిస్తున్న బొడ్రాయి ఉత్సవాలల్లో గురువారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం పాల్గొని బొడ్రాయి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ రామకృష్ణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.