జడ్చర్ల, జూన్ 9 : ఇంట్లోనే అన్ని రకాల స్వచ్ఛమైన, సేంద్రియ కూరగాయలకు మిద్దె, పేరటి తోటలు కేరాఫ్‌గా మారుతున్నాయి. విచ్చలవిడిగా పురుగుల మందులు వాడి కూరగాయలు పండించడంతో ఆహారం విషతుల్యమవుతున్నది. దీంతో ఆహారసమస్యలు తలెత్తుతున్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అందుకోసమే చాలా మంది తమ ఇంటి ఆవరణలోనే రసాయనాలు, పురుగుల మందులు వాడకుండా కూరగాయలను పండిస్తున్నారు.
మిద్దెపై, ఇంటి ఆవరణలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను కుటుంబ అవసరాలకు తగినట్లుగా సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండడం కూడా ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇంటిలో 50 గజాల స్థలం ఉంటే ఒక కుటుంబానికి సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పండించుకోవచ్చని పెరటి, మిద్దె తోటల పెంపకందారులు చెబుతున్నారు. ఇంటి టెర్రస్‌పై కూడా ఎలాంటి ఖర్చు లేకుండానే వాడిపడేసిన వస్తువులను తొట్లుగా మార్చుకొని కూరగాయలు పండించొచ్చంటున్నారు.
ప్లాస్టిక్ బ్యాగులు, వాడిపడేసిన కూలర్లు, బకెట్లు, గ్రోబ్యాగ్స్, పేయింట్ డబ్బాలు, డ్రమ్ములను తొట్లుగా మార్చుకోవచ్చు. ఇలాంటి వస్తువులు లేకుంటే మార్కెట్లో లభించే తొట్లను వినియోగించుకోవచ్చు. పెరటితోటలను పెంచుకోవాలంటే ముందుగా ఎర్రమట్టి 45 శాతం, ఆవుపేడ ఎరువు 40 శాతం, ఇసుక లేక కోకాపీట్ 10 శాతం, వేపపిండి 5 శాతం తీసుకొని వాటిని బాగా కలిపి తొట్లలో నింపుకోవాలంటున్నారు. అలా నింపుకున్న తర్వాత తొట్లలో విత్తనాలు వేసుకోవాలి. అయితే, ఎనిమిది గంటలపాటు ఎండతగిలే ప్రాంతాల్లో వంకాయ, టమాటా, మిర్చి, బెండ, బీరతోపాటు తీగజాతి కూరగాయలు వేసుకోవాలని, నీడలో ఆకుకూరలను పెంచుకుంటే మంచి దిగుబడి వస్తుందని పెరటి, మిద్దె తోటల పెంపకందారులు చెబుతున్నారు.

ఇండ్లలో వంటలు చేసే సమయంలో వినియోగించే కూరగాయల తొక్కలతో కంపోస్టు ఎరువును తయారుచేసుకోవచ్చు. ఇందుకుగానూ 200 లీటర్ల డ్రమ్ములను రెండు తీసుకొని వాటికి పూర్తిగా రంధ్రాలు చేయాలి. డ్రమ్ము అడుగు భాగంలో మట్టి ఒక లేయర్, దానిపై వంటింట్లో వచ్చే వేస్టేజీ, పెరటితోటల్లో లభ్యమయ్యే ఆకులకు మరో లేయర్‌గా డ్రమ్ము పూర్తిగా నిండే వరకు వేసుకోవాలి. అది నిండిన తర్వాత డ్రమ్ముపై మూతపెట్టి ఉంచాలని మిద్దె తోటల సలహాదారు జయలక్ష్మి సూచించారు. డ్రమ్ములో వేసిన చెత్త పూర్తిగా ఎండిపోయేవరకు ఉంచితే కంపోస్టు ఎరువుగా తయారవుతుంది. ఈ ఎరువును చెట్లకు వేసుకుంటే పూత, కాత బాగా వస్తుంది.
ఆవుపేడ 10 కిలోలు, గో మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కేజీలు, శనగపిండి 2 కేజీలు ఒక డ్రమ్ములో వేసి నిండుగా నీళ్లుపోయాలి. నిత్యం దానిని కుడివైపుగా ఒక కర్రతో మెల్లగా తిప్పాలి. అలా వారం రోజులపాటు కలపాలి. అలా చేస్తే ద్రవామృతం తయారీ అవుతుంది. ఈ ద్రవామృతం ఒక భాగానికి మూడు భాగాల నీటిలో కలిపి మొక్కలకు సాయంత్రం నీటిని పట్టిన తర్వాత వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మొక్కలు పచ్చగా ఉండడమే కాకుండా పూత, కాత బాగా వస్తుంది. ప్రతి 15 రోజులకోసారి ద్రవామృతాన్ని వేయాలి.