మక్తల్ రూరల్, జూన్ 9 : పర్యావరణాన్ని కాపాడాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, లేకుంటే వాతావరణ సమతుల్యం తెబ్బతిని ప్రపంచ వినాశనానికి దారితీస్తున్నదని తమిళనాడుకు చెందిన అన్బు చార్లెస్ హెచ్చరించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ తమిళనాడులోని నమ్మకల్ జిల్లా కేంద్రానికి చెందిన చార్లెస్ ప్రారంభించిన సైకిల్ యాత్ర గురువారం మక్తల్‌కు చేరుకున్నది. టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాంలింగం ఆధ్వర్యంలో స్థానికులకు ఆయన పర్యావరణంపై అవగాహన కల్పించా రు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో నానాటికి చెట్లు అంతరించిపోవడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రజలకు అవగాహన కల్పించేందుకే తన సొంతూరి నుంచి రెండు నెలల కిందట కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు చెప్పాడు. 2005 ఏప్రిల్ 22న తొలిసారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు 20 రాష్ర్టాల్లో 45 వేల కి.మీ. యాత్ర పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ యాత్రలో విద్యార్థులు, స్థానికులను కలిసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో అందరినీ బాధ్యులను చేయాలన్నారు. అనంతరం టీఆర్ఎస్ నేత రాంలింగం అతడికి ఆర్థిక సాయం చేశాడు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో నాగప్ప, రిటైర్డ్ ఉపాధ్యాయులు జనార్దన్, వెంకట్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గోపాల్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.