మల్దకల్, మే 30: ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం సోమవారం అమావాస్యను పురస్కరించుకొని భక్తలతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామివారికి అర్చకులు మధుసూదనాచారి, రవి, ధీరేంద్రదాస్ ఆధ్వర్యంలో బిందెసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని రాయిచూర్, బెంగళూర్, కర్నూల్, గుంతకల్లు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. రాత్రివేళల్లో వివిధ ప్రాంతాల భజన బృందాల సభ్యులు భజనలు చేశారు. భక్తులకు మధ్యాహ్నం కాకతీయ టెక్నో పాఠశాల, రాత్రి వేళల్లో శాంతినగర్‌కు చెందిన శివశివానీ పాఠశాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సద్దలోనిపల్లిలో స్యయంభూగా వెలిసిన కృష్ణాస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అమవాస్యను పురస్కరించుకొని సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కథకుడు ఆంజనేయులు శ్రీనివాస కల్యాణంపై హరికథను వినిపించారు. భక్తులు శ్రద్ధతో ఈ కథను ఆలకించారు. కథకు హార్మోనిస్టు స్వాములు, తబలిస్టు రఘు సహకారం అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ కథకుడిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో ఈవో సత్యచంద్రారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ధరూరు, మే 30: సోమవారం అమావాస్యను పురస్కరించుకొని పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసుకుని స్వామివారి దర్శనం చేసుకొన్నారు. వీరికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి మహాత్మ్యాన్ని తెలుపుతూ తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తులకు ఆంజనేయ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గిరిపాదరావు, అర్చకులు భీంసేనాచార్యులు, మధ్వాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
అయిజ, మే 30: పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం అమావాస్యను పురస్కరించుకొని తిక్కవీరేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకం, అలంకరణ, పుష్పాభిషేకం, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. అలాగే పట్టణంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప స్వామి, వీరబ్రహ్మేంద్ర శివరామాంజనేయస్వామి, ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, తుపత్రాల గ్రామంలోని ఆంజనేయస్వామి, ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం, రాయచూరు జిల్లా, మాన్వి తాలూకాలో వెలిసిన పంచముఖి ఆంజనేయస్వామికి భక్తులు పోటెత్తారు. సోమవారం అమావాస్య కావడంతో తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన భక్తులు పంచముఖి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవస్థాన అర్చకులు స్వామివారికి అభిషేకం, ఆకుపూజ, పుష్పాభిషేకం నిర్వహించారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ర్టాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకొన్నారు. సాయంత్రం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ ప్రాంగణంలో వెలిసిన దుకాణాల్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేశారు.
ఇటిక్యాల, మే 30: సోమవారం అమావాస్యను పురస్కరించుకొని బీచుపల్లి క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ప్రహ్లాదాచారి, మారుతాచారి, సందీపాచారి, వాల్మీకి పూజారులు స్వామివారికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, మహామగళహారతి, తీర్థప్రసాదాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. క్షేత్రానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానమాచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమావాస్యను పురస్కరించుకొని ఆలయ కమిటీ భక్తులకు అన్నదాన కార్యక్రమం చేసింది. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి రామన్‌గౌడ్ పర్యవేక్షించారు.
ధరూరు, మే 30: మండలంలోని నెట్టెంపాడులో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం అమవాస్యను పురస్కరించుకొ గ్రామదేవతల ఆలయాల వద్దకు వచ్చే భక్తులకు సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు గుడిసె శివన్న, కమిటీ నాయకులు ఎల్లప్ప, నాగేశ్, రమేశ్, వెంకటన్న, దేవన్న, సురేశ్, మల్లేశ్, రాములు, గోపాల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.