సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ బస్టాండ్ వద్ద ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణను మంత్రి సందర్శించారు. అభ్యర్థులతో కలిసి భోజనం చేశారు. పట్టణంలోని రామయ్యబౌలి పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కింద రూ.27.87లక్షలతో ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మినీట్యాంక్ బండ్, ఐలాండ్ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు.
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, మే 30: స్వయంకృషితో విద్యనభ్యసిస్తూ సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై పరిశీలించారు. కోచింగ్ అంటే చాలు హైదరాబాద్ చేరుకొని అక్కడే శిక్షణ తీసుకునే రోజులు ఉండేవని, నిరుద్యోగులకు ఇబ్బందులు ఉండకుండా శిక్షణను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.
పట్టుదలతో చదివి ఉద్యోగాలను సాధించాలని సూచించారు. ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా తక్షణమే ఏర్పాటు చేస్తామని అందరూ ఉద్యోగాలు సాధించేలా కృషి చేయాలన్నారు. అభ్యర్థులతో కలిసి ఉచితంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్‌పవర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ ఉన్నారు.
మహబూబ్‌నగర్ పట్టణంలోని రోడ్లుభవనాల శాఖ అతిథి గృహం చౌరస్తా వద్ద, బీఆర్ అంబేద్కర్ చౌరస్తా, రామయ్యబౌలిలో హోమ్ వాటర్ డ్రైన్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల విస్తరణతోపాటు మహబూబ్‌నగర్‌ను దశదిశలా అభివృద్ధి చేస్తామన్నారు. గతానికి ప్రస్తుతానికి మహబూబ్‌నగర్ రూపురేఖలు పూర్తిస్థాయిలో మారిపోయాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి స్థిర ఆస్తుల విలువ రోజురోజుకూ పెరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో తాగునీటి గోస తీరిందని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలను కల్పిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి పాఠశాలలో కిచెన్ షెడ్, ప్రహరీ, టాయిలెట్ బ్లాక్ పనుల ఆధునీకరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సుమారు 7వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుచేస్తుందన్నారు. జిల్లాలో 291పాఠశాలను ఈ పథకం కింద ఎంపిక చేశామన్నారు. రామయ్యబౌలి పాఠశాలను రూ.27.87లక్షలతో పనులను ఆధునీకరిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భోధన అమలుచేయడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుందన్నారు. ప్రతి ఒక్కరినీ విద్యావంతులని చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
మినీ ట్యాంక్‌బండ్‌లో జరుగుతున్న ఐలాండ్‌తోపాటు తదితర అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆటంకం కల్గకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అదనపు కలెక్టర్ తేజస్‌నందలాల్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనుల్లో అలసత్వం ఎక్కడా కనిపించకూడదన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే పరిష్కరించుకుంటూ నిర్ధేశించుకున్న సమయంలోపు పనులు పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, శివరాజ్ ఉన్నారు.