‘కుటుంబ బాధ్యతలే తనను సివిల్స్ వైపు నడిపించాయి.. మూడు సార్లు ప్రయత్నించినా ఐఏఎస్ రాలేదు, అయినా పట్టువదలకుండా పోరాటం చేసి నాలుగో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో 56వ ర్యాంకు సాధించింది మహబూబ్‌నగర్ జిల్లా లాల్యానాయక్ తండాకు చెందిన డా. కిరణ్మయి విజయ్‌కుమార్..’ ‘తన తండ్రి కల సాకారానికి సాధన చేసి నాలుగుసార్లు ఫలించకపోయినా ఐదో ప్రయత్నంలో 448వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు..ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు నాగర్‌కర్నూల్ జిల్లా రాచాలపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి.’ సివిల్స్‌లో రాణించిన పాలమూరు ఆణిముత్యాలపై ప్రత్యేక కథనం.
మహబూబ్‌నగర్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కుటుంబ బాధ్యతలే తనను సివిల్స్ వైపు నడిపించాయని అఖిల భారత స్థాయిలో 56వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్ జిల్లా లాల్యానాయక్ తండాకు చెందిన డా. కిరణ్మయి విజయ్‌కుమార్ తెలిపారు. మూడు సార్లు ప్రయత్నించినా ఐఏఎస్ రాలేదు. అయినా పట్టువదలకుండా పోరాటం చేసి నాలుగో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించింది. 2018లో తొలి ప్రయత్నంలోనే 573వ ర్యాంకు వచ్చింది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసుకు ఎంపికైంది. 2019 రెండోసారి సివిల్స్ రాస్తే 633వ ర్యాంకు వచ్చింది.
ఈ ర్యాంకుతో డానిక్స్(ఢిల్లీ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్ సివిల్ సర్వీసెస్)లో డిఫ్యూటీ కలెక్టర్‌గా ఎంపికైంది. డిసెంబర్ 2020 నుంచి ఇప్పటికీ డానిక్స్ శిక్షణలో ఉన్నారు. శిక్షణలో ఉంటూనే 2020లో మూడో ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిన నేపథ్యంలో మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్ గట్టెక్కలేకపోయారు. ఇంటికి దూరంగా ఢిల్లీలో శిక్షణలో ఉండిపోయారు. శిక్షణలో భాగంగా కరోనాను ఎదుర్కొనేందుకు డిఫ్యూటీ కలెక్టర్లకు ఢిల్లీలో హాస్పిటల్స్ పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. అందులో కిరణ్మయి కూడా ఉన్నారు.
భర్త, కూతురు హైదారాబాద్‌లో ఉంటే ఆమె మాత్రం ఢిల్లీలో ఉండి కరోనా రోగులకు సౌకర్యాలను అందించేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఈ సమయంలోనే ఆమె రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. దీంతో మూడో సారి సివిల్స్ ప్రిలిమినరీ దాటడమే కష్టమైపోయిందని ఆమె తెలిపారు. అయినా నిరాశ చెందలేదు. తన 8 ఏండ్ల కూతురు లక్ష్మీసహస్రను ఇంటి వద్దే వదిలి శిక్షణలో ఉంటూనే సివిల్స్ కోసం పట్టువదలకుండా ప్రయత్నించింది.
చివరకు సోమవారం ప్రకటించిన సివిల్స్ ర్యాంకుల్లో అఖిల భారత స్థాయిలో 56వ ర్యాంకు సాధించింది. ఆప్షనల్స్‌గా మెడిసిన్ తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంసెట్ రాసినప్పుడు 24వ ర్యాంకు సాధించి ఉస్మానియాలో ఎంబీబీఎస్ చదివిన కిరణ్మయి..తర్వాత పీజీ (జనరల్ సర్జరీ) కూడా అదే వైద్య కళాశాలలోనే చేశారు. వైద్యురాలు కావడం వల్లే తాను ఆప్షనల్‌గా మెడిసిన్ తీసుకున్నట్లు తెలిపారు.