అయిజ, మే 29: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతున్నది. ఆదివారం ఇన్ఫ్లో 4,327 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 276 క్యూసెక్కులు నమోదైంది. టీబీ డ్యాం 100.855 గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యానికిగానూ ప్రస్తుతం 37.250 టీఎంసీల నీటినిల్వ ఉంది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గానూ ప్రస్తుతం 1611.03 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు టీబీ బోర్డు ఎస్ఈ నాగమోహన్, డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు.
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కొనసాగుతున్నది. ఆదివారం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో 223 క్యూసెక్కులు ఉండగా, ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 285 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, 190 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఆర్డీఎస్ కర్ణాటక ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం 7 అడుగుల నీటిమట్టం నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.