నవాబ్‌పేట, మే 29 : మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల తుఫా న్ కారణంగా కొంత ఇబ్బంది పడిన రైతులు గత మూడు, నాలుగురోజుల నుంచి నిర్దేశించిన కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రభు త్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మండలంలో మొత్తం 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు.
ఐకేపీ ఆధ్వర్యంలో లింగంపల్లి, లోకిరేవు, గురుకుంట, చౌడూర్, కాకర్లపహాడ్, నవాబ్‌పేట, కారుకొండ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయగా, రుద్రారం, కొండాపూర్, కూచూర్, ఇప్పటూర్, కొల్లూరు, పోమాల్ గ్రామాల్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో అవసరమైన కొనుగోలు కేంద్రాలతోపాటు గన్నీబ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మండలంలోని రైతులకు సుమారు 90వేల గన్నీబ్యాగులను అందజేశారు.
ధాన్యం తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960 ధర లభిస్తుండడంతో రైతులు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు కొల్లూరులో 9,378బస్తాలు, రుద్రారంలో 12,717, ఇప్పటూర్‌లో 8,284, కొండాపూర్‌లో 4,523, పోమాలలో 3,510, కూచూర్లో 5,510, లింగంపల్లిలో 7,050, కాకర్లపహాడ్‌లో 5,544, నవాబ్‌పేటలో 1,215, చౌడూర్‌లో 4,823, గురుకుంటలో 8,295, లోకిరేవులో 1,101, కారుకొండలో 5,085 బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. హమాలీల సహకారంతో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేసి గోదాములకు తరలిస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరా లు, రైతుల వివరాలు ఆన్లైన్ చేసి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. డబ్బుల చెల్లింపులో జాప్యం జరగకుండా సంబంధిత అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు.
లింగంపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో సత్వరమే డబ్బులు జమ చేసేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించి ఆన్లైన్ చేయిస్తున్నాం. కొనుగోలు చేసిన ధాన్నాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలిస్తున్నాం. ధాన్యం తూకంలో ఎక్కడా తరుగు, కోతలు లేవు. అవసరమైనన్ని గన్నీబ్యాగులు తెప్పించి రైతులకు అందజేస్తున్నాం.
– లక్ష్మమ్మ, మహిళా సంఘం గ్రామ అధ్యక్షురాలు, లింగంపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం దిగుబడి మేరకు ఆయా గ్రామాల్లో పీఏసీసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతులకు సరిపడే గన్నీబ్యాగులు తెప్పిస్తున్నాం. ఇప్పటికే రైతులకు 90వేల బ్యాగులు అందజేశాం. ఈనెలాఖరులోగా మండలానికి మరో లక్ష బ్యాగులు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం విక్రయించే రైతులకు 10 రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేవిధంగా సంబంధిత సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
– మాడెమోని నర్సింహులు, సింగిల్‌విండో చైర్మన్, నవాబ్‌పేట