మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, మే 29 : మిల్లెట్స్ ఆహారంతో మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని ప్రకృతి ఆహార నిపుణులు ఎంసీవీ ప్రసాద్ మదనపల్లె అన్నారు. అదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మిద్దెతోట మిల్లెట్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రస్తుతం అన్నం తినడం వల్లే పలువురు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. మిల్లెట్స్ భోజనం తీసుకోవడంలో ఎలాంటి అనుమానం లేదని, ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని సూచించారు. ప్రతి రోజు రాగి జావా తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పారు.
సీజనల్ పండ్లు తప్పకుండా తినాలని, రాగి సంకటి, కొర్రలు, సామలు ఆహారం తీసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ 8 శాతం ఉందటే అనార్యోగ్యానికి గురైనట్టే అన్నారు. మానవజాతి ఆహారం ప్రస్తుతం సరిగ్గా లేదని, ఆహార పద్ధతులు, ఉత్పత్తుల గురించి పట్టించుకోకపోవడంతో చాలా రోగాలు వస్తున్నాయని చెప్పారు. సేంద్రియ పంటలు తగ్గిపోయాయని అన్నారు. వ్యవసాయ రంగంలో విపరీతంగా రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం పెరిగిందని, ఈ పంట ఉత్పత్తులను తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ఎంతో అవసరమని వివరించారు.
సిరి ధాన్యాలు తీసుకోవడంతో చాలా వరకు రోగాలు తగ్గుతాయని చెప్పారు. అలాగే నాటు విత్తనాలు, మిల్లెట్స్, ఆర్గానిక్ మామిడి పంట్ల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రముఖ మిల్లెట్స్ చెఫ్ రాంబాబు, ప్రభుత్వ జనరల్ దవాఖాన ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్, జిల్లా అటవీశాఖ అధికారి గంగారెడ్డి, అధ్యక్షుడు జగపతిరావు, అరుణ్‌రెడ్డి పాల్గొన్నారు.