జీలుగ సాగుతో భూసారం పెరుగుతుంది. అందుకే రైతన్నలు ఆసక్తి చూపుతున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ తరుణంలో సేంద్రియ పద్ధతుల్లో భూమిలోని సారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, పిల్లిపెసర, జనుము వైపు మొగ్గు చూపుతున్నారు. 65 శాతం సబ్సిడీతో వ్యవసాయ శాఖ అందజేస్తున్నది. దీంతో భూసారం పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
వనపర్తి రూరల్, మే 29: రైతులు జీలుగ సాగు ఎరువులపై ఆసక్తి కనబర్చుతున్నారు. వరి ఇతర పంటల సాగులో దిగుబడుల పెరుగుదలకు కేవలం రసాయనిక ఎరువులను మాత్రమే వినియోగిస్తున్నారు. అవీ మోతాదుకు మించి భూమికి అందించడంతో పంటల దిగుబడిలో పెరుగుదల తగ్గడమే కాకుండా భూమి స్థితిగతుల్లో మార్పులు చెంది చవుడు భూములుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రియ పద్ధతుల్లో భూసారం పెంచడానికి పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, పిల్లిపెసర, జనుములపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నేలలను సహజ సిద్ధంగా సారవంతంగా చేసేందుకు పచ్చిరొట్ట సాగును ప్రోత్సహిసూ వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాలను 65శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నారు. వనపర్తి జిల్లాలోని ప్రతి మండలానికీ కలిపి ఈ ఏడాది వానకాలం సీజన్‌కు మొదటి విడుతగా మొత్తం 1486 క్వింటాళ్ల జీలుగు విత్తనాలు వచ్చాయి. 65శాతం సబ్సిడీపై రైతులకు 30కేజీల బస్తా ధర రూ.664.20కు లభిస్తున్నది. అసలు ధర రూ. 1897.50కు సబ్బిడీ రూ. 1233.30 పోగా రైతుకు ధర రూ.664.20లకు లభిస్తుంది.
వివిధ పంటల సాగు చేయడానికి 45 నుంచి 50 రోజుల ముందుగానే ముఖ్యంగా వరి సాగు చేసే భూముల్లో తొలకరి వర్షాలకు పొలాన్ని దుక్కి చేసి ఎకరానికి 15కిలోల జీలుగ విత్తనాలు పొలాల్లో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్న జీలుగ విత్తనాలు 45-50 రోజులకు పూత దశకు వస్తుంది. ఈ దశలో మొక్కలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ దశలో జీలుగ పంటను పొలంలో కలియ దున్నాలి. దీంతో భూమిలో భూసారంపెరుగుతుంది.
అమరచింతకు 120 క్వింటాళ్లు, ఆత్మకూర్-90, కొత్తకోట- 150, మదనాపూర్ -200, పెద్దమందడి-80, చిన్నంబావి -20, పెబ్బేరు-70, శ్రీరంగాపురం-70, వీపనగండ్ల-40, ఘణపురం-226, గోపాల్పేట-150, పాన్‌గల్-80, రేవల్లి-90, వనపర్తి 100 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాదికి వానకాలం సీజన్‌కు మొదటి విడుతగా వనపర్తి మండలానికి 120 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు వచ్చాయి. రైతులు ఇప్పటికే 50శాతం కొనుగోలు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది వీటిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు. సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులు సాగు తప్పనిసరి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది.
– సుధాకర్‌రెడ్డి, వనపర్తి జిల్లా వ్యవసాయశాఖ అధికారి