కోడేరు, ఆగస్టు 17 : భార్యభర్తల మధ్య కలహం ఇద్దరు పిల్లల చావుకు కారణమైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం ఎత్తం శివారులోని గుట్టల వద్ద చోటు చేసుకున్నది. వివరాలు ఇలా.. కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామానికి చెందిన మొట్టె రాముడు కొడుకు ఓంకార్(35)కు ముగ్గురు భార్యలు. గతంలోనే మొదటి భార్య మృతి చెందగా.. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలుకు చెందిన యువతిని రెండో పెండ్లి చేసుకున్నాడు.
అయితే నిత్యం మద్యం తాగి భార్యను వేదిస్తుండడంతో ఆరేండ్ల కిందట భర్తను వదిలి తల్లిగారింటికి వెళ్లింది. తర్వాత ఓంకార్ కుడికిళ్లకు చెందిన మాచుపల్లి మహేశ్వరిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వీరికి చందన (3), విశ్వనాథ్(1) సంతానం. మేస్త్రీగా పనిచేసే ఓంకార్ తాగుడుకు బానిసై గ్రామంలో పలువురితో గొడవ పడేవాడు. దీంతో అతడిని శాడిస్టుగా భావించి గ్రామస్తులు మాట్లాడేవారు కాదు.
అవమానంగా భావించిన ఓంకార్ ఇటీవల భార్యా, పిల్లలతో కొల్లాపూర్‌కు మకాం మార్చాడు. అద్దె ఇంట్లో ఉంటూ మేస్త్రీ పనులు చేసేవాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని కొద్ది రోజులుగా భర్తను భార్య అడుగుతూ వచ్చింది. అయితే ఇంకా పిల్లలు కావాలి.. ఆపరేషన్ వద్దు అంటూ ఇద్దరి మధ్య చాలా సార్లు కొట్లాట జరిగింది. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్‌లో ఆపరేషన్ చేయిస్తానని భార్యకు చెప్పి ఆమెతోపాటు పిల్లలతో కలిసి ఓంకార్ బైక్‌పై బయలుదేరాడు. గంట్రావుపల్లి స్టేజీ వద్దకు రాగానే భార్యభర్తలు ఇద్దరూ మళ్లీ కొట్లాడారు. దీంతో భార్యపై చేయిచేసుకున్నాడు. మనస్తాపానికి గురైన మహేశ్వరి అక్కడి నుంచి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు పోతానని భర్తను బెదిరించి వెళ్లింది.
ఆగ్రహానికి గురైన ఓంకార్ ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై కోడేరు మండలం ఎత్తం గ్రామ శివారులోని గుట్టల వద్దకు వెళ్లాడు. అక్కడ చిన్నారుల గొంతును కత్తితో కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ అదే కత్తితో ఆత్మహత్యకు యత్నించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాగా మహేశ్వరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడి పోలీసులు ఆమె భర్త సెల్‌ఫోన్ లొకేషన్ చూడగా ఎత్తం శివారులో ఉన్నట్లు గుర్తించి ఎస్సై రాము తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు.
వారి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. రోడ్డు సమీపంలో ఓంకార్ ఉండటాన్ని గుర్తించి అపస్మారక స్థితిలో ఉన్న అతడిని అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. పరిసరాల్లో చూడగా చెట్టు కింద ఇద్దరు పిల్లలు విగతజీవులగా కనిపించారు. కత్తితో గొంతుకోసి కసాయి తండ్రి హత్య చేసి ఉంటాడని గుర్తించారు. చిన్నారుల మృతదేహాలను నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఓంకార్‌ను మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు.