గద్వాలటౌన్, మే 29 : వైద్య సేవల కోసం దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించినప్పుడే గుర్తింపు వస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దూద్ దవాఖానను బోరవెల్లి కేశమ్మగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఆదివారం ఎమ్మెల్యే నామకరణం చేశారు. నూతన దవాఖానను ప్రారంభించారు.
ముందుగా స్థల దాత కేశమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాతల పేరు సార్థకం అయ్యేలా సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ రామేశ్వరమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, కన్జ్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.