కల్వకుర్తి రూరల్, మే 29 : కొడుకు మృతి చెందాడన్న విషయం తెలిసిన వెంటనే తల్లి కూడా మృతి చెందిన విషాదకరమైన ఘటన ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కల్వకుర్తి పట్టణానికి చెందిన సత్యంగౌడ్(45) పట్టణంలో మిర్చి బండి వేసుకుని జీవనం సాగించేవాడు. సత్యంగౌడ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా శనివారం రాత్రి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
గాయపడిన అతడిని హైదరాబాద్ దవాఖానకు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందాడు. కొడుకు మృతి చెందాడన్న విషయం చారకొండలోని కూతురి ఇంటి వద్ద ఉన్న తల్లి రుక్నమ్మ(65)కు తెలియడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కుమారుడు, తల్లి ఇద్దరు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆదివారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు.