మహబూబ్‌నగర్ రూరల్, ఆగస్టు 1: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రా ష్ట్రంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా నిర్వహించాలని క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8 నుంచి 22 వరకు సాంస్కృతిక, క్రీడా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సన్నాహక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడా శాఖ తరఫున వ్యాప్తంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వివిధ క్రీడలను నిర్వహించాలని ఆధికారులను ఆదేశించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో 15 రోజులపాటు దేశ భక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా నాటక, నృత్య, సంగీత, కళా కార్యక్రమాలను కవి సమ్మేళనాలు నిర్వహించాలన్నారు.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజానికి చెందిన పర్యాటక కేంద్రాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా టూరిజం కేంద్రాల్లో, చారిత్రక ప్రాధాన్యం, కట్టడాల వద్ద విద్యుద్దీపాలను అలంకరించాలని సూచించారు. సమావేశంలో యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, పర్యాటక శాఖ ఎండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్రీడా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, క్రీడా పాఠశాల ఓఎస్డీ డా.హరికృష్ణ పాల్గొన్నారు.