కథానిక కమామిషు 4
తెలుగులో కథానిక పూర్వాపరాలను సోదాహరణంగా వివరించడం మొదలుపెట్టే ముందు,ఈ రచనారూపం ఎక్కడ పుట్టి, ఎలా పెరిగి పెద్దదయిందనే వివరం ప్రస్తావించుకుని, మన కథకు మరలివద్దాం! 1842లో రష్యన్ రచయిత నికలాయ్ గగోల్ రాసిన ‘ఓవర్‌కోట్’ ప్రపంచ సాహిత్యంలో మౌలికమైన కథానికగా చెప్తారు పరిశోధకులు. దస్తయేఫ్స్కియ్ లాంటి మహారచయిత ‘మేమందరం గగోల్ ఓవర్‌కోట్ లోంచి ఊడిపడినవాళ్లమే’ అనడం విశేషం.
గగోల్ పుట్టిన యేడాదే పుట్టిన అమెరికన్ కథానిక రచయిత ఎడ్గార్ అలన్ పో కథానికను ఆసక్తికరంగానూ ఉత్కంఠభరితంగానూ తీర్చిదిద్దాడు. ‘పో’ కన్నుమూసిన మరుసటి సంవత్సరమే 1850 లో పుట్టిన ఫ్రెంచ్ కథానిక రచయిత మపాసా వాస్తవిక కథానిక రచయితల్లో మహాశిల్పిగా ఓ వెలుగువెలిగాడు. బతికింది 43 సంవత్సరాలే అయినా, మపాసా 300 కథానికలు రాశాడంటారు. మపాసా, తన కన్నా పదేండ్లు చిన్నవాడైన చేహఫ్ (చెఖోవ్)తో కలిసి, ప్రపంచ సాహిత్యంలో కథానికకు ప్రముఖస్థానం కల్పించినవాడుగా ప్రసిద్ధుడయ్యారు. వాళ్లందరూ ఎంత గొప్పవాళ్లయినా కావచ్చు కానీ, భారతీయ కథానికకు ఉత్ప్రేరకంగా పనిచేసింది వాళ్ల సాహిత్యం మాత్రం కాదు.
భారతీయ సాహిత్యానికి కథానిక అనే రూపాన్ని పరిచయం చేసినవాళ్లు పందొమ్మిదో శతాబ్దపు ఆంగ్లేయులే. ఆ మాట ఎంత వాస్తవమో, భారతీయ కథానిక రచయితలపై అంతోన్ చేహఫ్ ప్రభావం అపారమనే విషయమూ అంతే నిజం. ‘నీ కథానికలో నువ్వు గోడకు తుపాకీ వేలాడుతున్నదని రాశావనుకో, కథానిక అయిపోయేలోగా, అది పేలవలసిందే!’ అన్న చేహఫ్ మాటల్ని మనవాళ్లు ఇప్పటికీ ఉటంకిస్తూ ఉంటారు. ఎటొచ్చీ, దానిని పాటించేవాళ్లే తక్కువ! కాగా, పో, మార్క్ ట్వెయ్న్, ఓ.హెన్రీ, మపాసా తదితరుల ప్రభావమూ చెప్పుకోతగినదే.
గగోల్కన్నా పదేండ్లు చిన్నదైన జార్జ్ ఇలియట్ (అసలు పేరు మేరీ ఆన్ ఇవాన్స్) 1857లో గగోల్ ‘ఓవర్‌కోట్’ కథను ప్రచురించిన దశాబ్దంన్నరకు తన తొలి రచనగా ఓ కథానికను అనామకంగా అచ్చేసుకుంది. ‘సీన్స్ ఆఫ్ క్లెరికల్ లైఫ్’ (మతాధికారి జీవితంలో కొన్ని సంఘటనలు) అనే మూడు కథానికల సంకలనంగా మరుసటి యేడాది వచ్చిన పుస్తకంలో ఈ కథానికే తొలిరచన. ఈ పుస్తకాన్ని మాత్రం జార్జ్ ఇలియట్ అనే మగ పేరుతోనే అచ్చు వేసుకోవడం గమనార్హం. వామపక్ష పత్రికగా చెప్పుకునే ‘వెస్ట్ మినిస్టర్ రెవ్యూ’ సంపాదకురాలిగా, తన కాలం కన్నా ఎంతో ముందున్న రచనలు చేసింది జార్జ్ ఇలియట్. ముఖ్యంగా 1861లో ఆమె ప్రచురించిన గొప్ప నవల ‘సిలాస్ మార్నర్’ ఇతివృత్తం, పందొమ్మిదో శతాబ్దం మొదట్లో అమల్లో ఉండిన జీవిత విధానంపై విమర్శనాత్మక విశ్లేషణే. ఈ నవల వెలువడిన 94 సంవత్సరాల తర్వాత, 1955లో జాతీయ స్థాయిలో ఉత్తమ చలన చిత్రంగా చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా ‘బంగారు పాప’ మూలకథ ‘సిలాస్ మార్నర్’ నవల నుంచి తీసుకున్నదే. చెయ్యితిరిగిన నేతగాడు సిలాస్ మార్నర్కు మనుషులపైనా, వాళ్ల మంచితనంపైనా నమ్మకం పోవడం, అతని చేతుల్లోనే పదహారేండ్లు పెరిగిన చిన్న పిల్ల ఎప్పీ అతనికి తిరిగి మనుషులపై నమ్మకం కలిగించడం ఈ నవల ఇతివృత్తం. కానీ, తానో స్త్రీననీ, ఓ వివాహితుడి రెండో భార్యననే వాస్తవాలు కప్పిపెట్టి, మేరీ ఆన్ ఇవాన్స్ దశాబ్దాల తరబడి కలం పేరు నీడలో బతికేయాల్సి రావడం బ్రిటిష్ కుహనా సంస్కృతి నిజస్వరూపానికి నిదర్శనంగా నిలిచిపోయింది.
గగోల్ ‘ఓవర్ కోట్’ వెలువడడానికి రెండేండ్ల ముందే 1840లో పుట్టిన ఇంగ్లిష్ కథానిక రచయిత థామస్ హార్డీ పందొమ్మిదో శతాబ్దంలోనే డజను కథానికలు రాసి, ఇరవయ్యో శతాబ్దిలోని 1913లో సంకలనంగా ప్రచురించాడు. హార్డీ రచనలు ముఖ్యంగా ‘ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్’ లాంటి నవలలు మన రచయితలనూ, పాఠకులనూ ఎంతో ప్రభావితం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రడ్యార్డ్ కిప్లింగ్, మేయ్న్ లిండ్సేలాంటి మరికొందరు ఇంగ్లిష్ రచయితల రచనలే భారతీయ రచయితల కథానిక సాహిత్యం ప్రభావితమైనది.