నాగర్‌కర్నూల్, జూలై 24(నమస్తే తెలంగాణ): రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ముందుకు సాగుతున్నది. రైతుబీమా పథకంలో పేర్లు నమోదు కాని రైతులతోపాటు కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకూ పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఈ నెలాఖరు వరకు బీమా చేసుకునేందుకు మరోసారి అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ దేశంలో లేని గొప్ప పథకాలు అమలు చేస్తున్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డితోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించారు.
24గంటల ఉచిత విద్యుత్‌తోపాటు రైతుబంధు ద్వారా ఎకరాకు రూ.5వేలు, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, పంటల కొనుగోళ్లు, గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులకు వ్యవసాయం పండుగలా చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. బీళ్లుగా ఉన్న భూములు పచ్చని పంటలతో కోనసీమను తలపిస్తున్నాయి. రూ.50వేలు పలకని ఎకరా భూమి ధర రూ.50లక్షల వరకు చేరుకున్నది.
దీనికి రైతులు వ్యవసాయాన్ని విస్తృతం చేయడమే కారణం. అలాంటి రైతులు ఆకస్మికంగా మరణిస్తే కారణాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం రూ.5లక్షల బీమా అందజేస్తున్నది. 2018, ఆగస్టు 15నుంచి 18-60ఏండ్లలోపు రైతులు మృతిచెందితే కులం, మతం, పెద్దా చిన్న రైతనే తేడా లేకుండా పాస్ పుస్తకం ఉన్న ప్రతిఒక్కరికీ బీమా అందజేస్తున్నారు.
ఆధార్‌కార్డు ఆధారంగా వయస్సును ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి ప్రశంసలు పొందిన బృహత్తర పథకం రైతుబీమా. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు లక్షలాది మంది రైతు కుటుంబాల్లో వెలుగులు నిండాయి. చనిపోయిన రైతు కుటుంబాలకు నేరుగా ఎల్ఐసీ సంస్థ నుంచి డబ్బులు అందుతున్నాయి. దీనికోసం ప్రభుత్వమే ఒక్కో రైతు పేరిట రూ.4,110చొప్పున ప్రీమియం చెల్లించడం గమనార్హం. ఇప్పటికే దాదాపు రైతులందరూ రైతుబీమా పథకం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా వేలాది మంది భూములు కొనుగోలు చేస్తున్నారు.
రైతులు తమ వారసుల పేరిట భూములను నమోదు చేయిస్తున్నారు. అలాగే బీమా పథకంలో నమోదు చేసుకున్న వివరాల్లో తప్పులు ఉంటే సరి చేయించుకోవచ్చు. ఇలా రైతుబీమా కోసం వేలాదిమంది రైతులు ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రభుత్వం మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఏఈవోలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో నాలుగేండ్లలో 3,641మంది రైతులు మృతిచెందితే రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం రూ.182.05కోట్లు మంజూరు చేసింది. ఈ ఏడాది కొత్తగా 20,539మంది రైతులు రైతుబీమా పథకంలో చేరేందుకు అవకాశం ఉంది. 2021లో పాస్‌పుస్తకాలు మంజూరైన 33,994 మంది రైతులు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. బీమాకు దరఖాస్తు చేసుకునే నెలాఖరులోగా ఏఈవోలను సంప్రదించాలని. రైతులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– వెంకటేశ్వర్లు, డీఏవో, నాగర్‌కర్నూల్ జిల్లా
