గద్వాల, జూలై 23: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గద్వాల, అలంపూర్, అయిజ,వడ్డేపల్లి మున్సిపాలిటీల పరిధిలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనుల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. పనులు జరగని చోట మొదలు పెట్టాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు జంక్షన్లలో రోడ్లు, డివైడర్లకు పేయింటింగ్ వేయించి డివైడర్ మధ్యలో మట్టివేసి పెద్ద మొక్కలు నాటాలని సూచించారు.
జిల్లా ముఖద్వారాల్లో పేర్ల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్, మార్కెట్‌యార్డు నూతన కలెక్టరేట్ భవన పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పనులు ముమ్మరం చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున దోమల వల్ల ప్రజలు రోగాలబారిన పడకుండా చూడాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో జ్వరం సర్వే చేయాలని అధికారులకు ఆదేశించారు. సర్వేకు సంబంధించి నివేదిక పంపాలన్నారు. డ్రైనేజీల్లో మురుగు తొలగించి ఆయిల్ బాల్స్ వేయాలన్నారు.
ప్రతి మున్సిపాలిటీలో వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో నాలుగు శానిటేషన్ టీంలు పర్యటిస్తాయని తెలిపారు. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతిరోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. ప్రతిఇంటికీ మొక్కలు అందజేయాలని సూచించారు. పార్కుల్లో మొక్కలు విరివిగా నాటాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పార్కు పనులు పూర్తిచేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.
దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలన్నారు. ప్రతివార్డును క్రమం తప్పకుండా మున్సిపల్ కమిషనర్లు పర్యటించాలని ఆదేశించారు. ఇంటి, ఆస్తి పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. బిల్ కలెక్టర్లు వారి పరిధిలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం బిల్లులు వసూలు చేసి టార్గెట్ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు జానకిరామ్‌సాగర్, విజయభాస్కర్‌రెడ్డి, గోపాల్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.