అయిజ, జూలై 23: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు ఉట్టిపడేలా బోనాల పండుగ అంబరాన్నంటింది. పట్టణంలోని బీజీఆర్, అక్షర ఉన్నత పాఠశాలల్లో బోనాల పండుగను పురస్కరించుకొని విద్యార్థులు వివిధ వేషధారణతో అలంకరించుకుని బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ఉత్సవంలో విద్యార్థులు బోనాలకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కరస్పాండెంట్లు బాలవెంకట్‌రెడ్డి, మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ధరూరు, జూలై 23: ప్రతిఏటా ఆషాడమాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలను పాఠశాల విద్యార్థులు శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని రేవులపల్లిలో దయానంద్ ఆంగ్లో వేదిక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సతీశ్‌చంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు పండుగ సంస్కృతుల వేషధారణను ప్రదర్శించారు. శనివారం ఉదయం విద్యార్థులంతా భక్తిశ్రద్ధలతో బోనం కుండలను అలంకరించుకొని పోతురాజులు, అమ్మవారు, డప్పులోడిగా వేషాలంకరణ చేసుకుని గోల్కొండ బోనాల సంప్రదాయాన్ని ప్రతిబింబింపజేశారు. కార్యక్రమంలో పాఠశాల జెన్కో ఎస్ఈ జయరామ్, పాఠశాల నాట్య ఉపాధ్యాయుడు శెట్టిఅమరేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గట్టు, జూలై 23: మండలంలోని ఆలూరు ఎంపీపీఎస్‌లో బోనాల పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. పోతురాజుగా శివ అందరినీ ఆకర్షించారు. విద్యార్థినులు శివానీ, ప్రవళిక, రంగమ్మ, శృతి, ఉమాదేవి, మౌనిక తదితరులు బోనమెత్తారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వతేజ, దామోదర్‌గౌడ్, నిర్మల తదితరులు పాల్గొన్నారు.