ఇటిక్యాల, జూలై 23: సమాజంలో అన్నింటా అందరూ సమానమనే భావనతో ముందుకు సాగుదామని జెడ్పీ చైర్పర్సన్ సరిత పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఎమ్మెల్యే అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అధికార ప్రతినిధి మంద జగన్నాథం, మందకృష్ణ, సంపత్‌కుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. మహనీయులను ఆదర్శంగా తీసుకొని మనలో తక్కువ అనే ఆత్మన్యూనతను పారదోలి కలిసికట్టుగా సమానత్వం సాధించే దిశగా కృషి చేద్దామన్నారు.
ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. విద్యవల్లనే సమాజంలోని రుగ్మతలను రూపమాపవచ్చని పేర్కొన్నారు. మంద జగన్నాథం మాట్లాడుతూ.. సిద్ధ్దాంతాలను నమ్మిన గొప్పవ్యక్తి బాబూ జగ్జీవన్‌రాం అని కొనియాడారు. నాయకుల స్ఫూర్తితో పోరాట పటిమను అలవర్చుకొని ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే విజయాలు సాధ్యమవుతాయన్నారు. మాజీ ఎమ్మెల్యే సంపత్ మాట్లాడుతూ.. నాయకుల సేవలను స్మరించుకోవడానికి వారి మార్గంలో నడుచుకోవడానికి విగ్రహాలను ఏర్పాటు చేసుకొంటామన్నారు.
మందకృష్ణ మాట్లాడుతూ.. బాబూ జగ్జీవన్‌రాం జీవించినంత కాలం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం దేశ పునర్నిర్మాణంలోనూ రిజర్వేషన్ల కొనసాగింపులో ఎనలేని కృషిచేశారన్నారు. నాయకుల స్ఫూర్తితో ఏబీసీడీ వర్గీకరణ సాదించే దిశగా కలిసికట్టుగా ఉద్యమిద్దామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామపెద్దలు పలువురు నాయకులు పాల్గొన్నారు.
అయిజ, జూలై 23: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం మండలంలోని ఉప్పలలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా కాకుండా తత్వవేత్తగా, ఆర్థిక వేత్తగా జాతి గర్వించదగ్గ మహామనిషిగా ఎదిగారని, అంబేద్కర్ అడుగుజాడల్లో అందరూ నడిచి ఆయన మహోన్నత ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, సర్పంచ్ జయంతి, ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.