కల్వకుర్తిరూరల్, జూలై 23: హరితహారానికి సంబంధించి ప్రతి గ్రామంలో అధికారులు సూచించిన విధంగా వందశాతం లక్ష్యాన్ని చేరుకోవాలని డీఆర్డీవో నర్సింగ్‌రావు అన్నారు. శనివారం కల్వకుర్తి మండలంలోని మార్చాల, కుర్మిద్ద, జీడిపల్లి వెంకటాపూర్ తండాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు.
మొక్కలు చక్కగా పెరగడంపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామాలకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరగడంతో హరిత రహదారులుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా గ్రామాల్లో విస్తారంగా లక్ష్యానికిమించి మొక్కలు నాటాలని కోరారు.
తద్వారా గ్రామాల్లో కూలీలకు పని లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈజీఎస్ పథకంపై మరింత అవగాహన కల్పించాలని గ్రామాల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. అదేవిధంగా అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా ఈనెల చివరిలోగా జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన చెరువుల్లో పూడికతీత, ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో ఆంజనేయులు, ఎంపీవో దేవేందర్, ఏపీవో చంద్ర సిద్ధార్థ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
కల్వకుర్తి రూరల్, జూలై 23: గ్రామీణ ప్రాంత మహిళలు స్త్రీనిధి రుణాలతో ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారిని ప్రోత్సహించాలని నాగర్‌కర్నూల్ జిల్లా డీఆర్డీవో నర్సింగ్‌రావు సూచించారు. శనివారం కల్వకుర్తి పట్ట ణంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో వీవోఏలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామాల వారీగా స్త్రీ నిధి రుణాల వినియోగం చెల్లింపులు, పలు అంశాలపై సమీక్షించారు. రుణాలు పొందిన మహిళా సంఘాలు రుణాలను బ్యాంకులకు సకాలంలో చెల్లించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎం రామచంద్రుడు, ఏపీఎం సహదేవ్, శ్రీనివాసు లు, శేఖర్ తదితరులు ఉన్నారు.