‘నోట్లో ముద్ద పెట్టుకుంటుంటే అన్నంలో మన్ను పడేది.. చలిపెడితే కప్పుకునే దుప్పట్లన్నీ ఇంటి చుట్టూ ఉన్న బొక్కలకు పెడ్తుతుంటిమి.. వానొస్తే కురుస్తున్న ఇంట్లో ఉన్న గిన్నెలు, బోగాండ్లు పెట్టి పిల్లల్ని సంకలో ఎత్తుకుంటుంటిమి.. కంటి నిండా నిద్ర లేకుంటుండే.. సారు పుణ్యమా అని రెండేండ్ల సంది మా కుటుంబం కంటినిండా నిద్రపోతున్నది’ అని ఓ అవ్వ ఆనందభాష్పాలు రాల్చింది.
‘రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి.. కూలీనాలీ పోయినా తిన్నంకెనే సరిపోతుండె.. చిన్న చిన్న ఇండ్లల్లో, పూరి గుడిసెల్లో ఉండేటోళ్లం.. కొత్త ఇండ్లను కట్టనికే కూలికి పోయి తట్ట ఎత్తుతుంటే మేం ఇట్ల ఇండ్లు ఎప్పుడు కట్టుకుంటామో అని అనిపిస్తుండె.. మా కాయాకష్టానికి కట్టుకుంటామా? అనే అనుమానం ఉండె.. సొంతిండ్లల్ల ఉండాలని కలగనేటోళ్లం.. ఇప్పుడా కల నిజమైంది. గవర్నమెంట్ కట్టిచ్చిన పక్కా ఇంట్లో ఉంటున్నాం..’ ఇది డబుల్ బెడ్రూం ఇండ్లల్లో ఉంటున్న జనం మాట..
చిన్న చిన్న, కిరాయి, కూలిన ఇండ్లల్లో ఉంటున్న పేదల దీనస్థితిని చూసి చలించిన సీఎం కేసీఆర్ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు.. గేటెడ్ కమ్యూనిటీని తలదన్నేలా ఇండ్లు నిర్మించాలని ‘డబుల్ బెడ్రూం ఇండ్లు’ పథకానికి అంకురార్పణ చేశారు. పేదల సొంతింటి కలను నిజం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వేల ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ ఇండ్లల్లో ఇంటున్న వారు తమ జీవితం ధన్యమైందంటూ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు. మేము కట్టుకున్నా.. ఇలాంటి ఇంట్లో ఉండేవాళ్లం కాదంటూ ఆనందభాష్పాలు రాలుస్తున్నారు. తాగునీరు, కరెంట్, 40 ఫీట్ల రోడ్లు, చుట్టూ మొక్కల పెంపకం.. ఇలా అన్ని రకాల వసతులు కల్పించారు. దీంతో ‘డబుల్’ ఇండ్ల చుట్టూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి.
మహబూబ్‌నగర్, జూలై 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్బెడ్రూం ఇండ్ల పథకం వెలుగులు నింపుతున్నది. వందలాది కుటుంబాల సొంతింటి కల నిజమైంది. గర్వంగా మాకో సొంతిల్లుందని చెప్పుకుంటున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వాలు పదో పరకో ఇస్తే అది కూడా దళారుల పాలయ్యేది. రికార్డుల్లో మాత్రమే పేదల పక్కా ఇండ్ల లెక్కుండేది. రాజీవ్ గృహకల్ప ఇండ్లు ఇరుకిరుకుగా నిర్మించి ఇచ్చారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం పేదలకు చిన్నచిన్న గుడ్ల లాంటి ఇండ్లను కాకుండా డబుల్ బెడ్రూం ఉండేలా అన్ని సౌలత్‌లతో నిర్మించి ఇస్తున్నది. అర్హులైన పేదలను గుర్తించి పారదర్శకంగా ఇండ్లను పంపిణీ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ 2015 జనవరి 18న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. పాతపాలమూరులోని దళితవాడలో ఇండ్లను పరిశీలించి.. ఇంత చిన్న ఇండ్లల్లో ఎట్లా ఉంటారని ఆశ్చర్యపోయారు. జిల్లాకేంద్రంలోని స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న పేదలకోసం ప్రత్యేక స్కీం కింద 2వేల ఇండ్లను మంజూరు చేశారు. దీంతో ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రిస్టియన్‌పల్లిలోని ప్రభుత్వ భూమిలో 310ఇండ్లకు అంకురార్పణ చేశారు. వీరన్నపేటలో మరో 660, దివిటిపల్లిలో 1,024 ఇండ్లు నిర్మించారు. ఇవన్నీ పేదలకు పంపిణీ చేశారు. మరో 2వేల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి చొరవతో నిజాలాపూర్‌లో 20, అన్నాసాగర్‌లో 80 ఇండ్లు నిర్మించారు. లబ్ధిదారులతో గృహప్రవేశాలు కూడా చేయించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు దివిటిపల్లి, భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్ల జాగాల చుట్టూ భూముల ధరలు రూ.లక్షల్లో పలుకుతున్నాయి. క్రిస్టియన్‌పల్లి, దివిటిపల్లి, వీరన్నపేట చుట్టుపక్కల భూముల్లో ఖరీదైన ఇండ్లు, ఆపార్మెంట్లు వెలుస్తున్నాయి. క్రిస్టియన్‌పల్లి డబుల్ బెడ్రూంలను ఆనుకొని బైపాస్ రోడ్డు ప్రపోజల్ చేశారు. అంతేకాక కలెక్టర్ కార్యాలయం కూడా సమీపంలోనే ఉన్నది. వీరన్నపేటలోని కేటీఆర్ నగర్ పక్కనే చించోలి జాతీయ రహదారి బైపాస్ రానున్నది. దివిటిపల్లి వద్ద ఐటీ పార్క్ నిర్మాణం జరుగుతున్నది. ప్రస్తుతం కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల చుట్టూ భారత్‌మాల, బైపాస్‌రోడ్డు వెలుస్తుండడంతో మంచి డిమాండ్ వస్తున్నది. ఇక అన్నాసాగర్, దివిటిపల్లి డబుల్ ఇండ్లకు సమీపంలో 44వ జాతీయ రహదారి ఉన్నది. బెంగళూరు రహదారిని ఆరు లైన్లు చేస్తుండడంతో ఈ ఇండ్లకు ఊహించని డిమాండ్ రాబోతున్నది.
పేదలకు కేటాయించిన డబుల్బెడ్రూం ఇండ్లు గేటేడ్ కమ్యునిటీ లేఅవుట్‌ను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారి 40 ఫీట్ల విస్తీర్ణంలో ఉండగా.., అంతర్గత రహదారులు 30 ఫీట్లు ఉన్నాయి. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గుడి, బడి, కమ్యునిటీ హాళ్లకు జాగాలు కేటాయించారు. ప్రతి ఇంటిముందు మొక్కల పెంపకం, పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం ఇచ్చారు. మిషన్ భగీరథ తాగునీటి కనెక్షన్ ఇచ్చారు. విద్యుత్ సౌకర్యంతో గేటేడ్ కమ్యునిటీని తలదన్నేలా ఉన్నాయి. రెండేండ్ల కిందటే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 1,994, దేవరకద్ర నియోజకవర్గంలో వంద ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా వేలాది ఇండ్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్నాయి.
మహబూబ్‌నగర్ సమీపంలోని దివిటిపల్లిలో సర్వే నెంబర్ 423లో రూ.61.65కోట్లతో కేసీఆర్‌నగర్‌లో నిర్మించిన 1,024 ఇండ్లను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ సెప్టెంబర్ 5న ప్రారంభించారు. అనంతరం జూన్ 22, 2021న మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాలు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని వీరన్నపేటలో 660 ఇండ్లను నిర్మించారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి పేరుమీద కేటీఆర్ నగర్‌గా నామకరణం చేశారు. రూ.34.98 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండ్లను పేదలకు అందించారు. జూలై 13, 2020లో కరోనాను లెక్కచేయకుండా మంత్రులు లబ్ధిదారులకు అందించారు. క్రిస్టియన్‌పల్లి సమీపంలో ఆదర్శనగర్ కాలనీలో రూ.18.75 కోట్లతో 310 ఇండ్లను నిర్మించారు. వీటిని డిసెంబర్ 4, 2017లో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సొంత గ్రామమైన అన్నాసాగర్‌లో నాలుగెకరాలను కొనుగోలు చేసి తన తండ్రి దివంగత ఆల రఘుపతిరెడ్డి జ్ఞాపకార్థం 80 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. గ్రామంలోని ఇండ్లు లేని పేదలకు వీటిని పంపిణీ చేశారు. ఇండ్ల మధ్య సువిశాలమైన పార్కును కూడా ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. ఇదే నియోజకవర్గంలో నిజాలాపూర్‌లో 20 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు.
పాత ఇల్లు పడిపోయింది.. వానొస్తే కురుస్తుండె. అందరూ కూలీనాలికి పోతుండ్రి.. నేను ఇంటికాడనే పిల్లల్ని చూసుకుంటూ ఉండేదాన్ని. చేసిన కష్టమంతా తిండికి, పిల్లల్ని సాకనికెనే సరిపోతుండె.. పడిపోయిన ఇంటిని చూసి బాధేస్తుండె.. తింటుంటే పై నుంచి మన్ను పడుతుండె.. తీసి తింటుంటుమి.. మా కష్టాలు చూసి మా సారు ఇల్లు ఇచ్చిండు.. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సార్లకు రుణపడి ఉంటా.
– వెంకటమ్మ, అన్నాసాగర్, భూత్పూర్ మండలం
పాతపాలమూరులో ఉంటుంటిమి.. మా ఇల్లు కూలిపోయిండె. మా ఆయనతోపాటు అతడి తమ్ముడు, అత్త, పిల్లలం కూలిపోయిన ఇంట్లోనే ఉంటిమి. సీఎం కేసీఆర్ సారు మా ఇండ్లను చూసి పోయిండు. క్రిస్టియన్‌పల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లు కడితే మాకో ఇల్లు ఇచ్చిన్రు. పాడుపడిన ఇంటిని వదిలి కొత్త ఇంట్లోకి వచ్చాము. అసలు ఇలాంటి ఇల్లు ఇస్తారనుకోలేదు. నీళ్లు, కరెంట్, రోడ్లు అన్నీ బాగున్నాయి.
– జ్యోతి, క్రిస్టియన్‌పల్లి, మహబూబ్‌నగర్
మేం మహబూబ్‌నగర్‌లోని షాషాబ్‌గుట్టలో చిన్న కిరాయి ఇంట్లో ఉంటిమి. మా పెద్దోళ్ల కాడ్నుంచి అందరూ కిరాయి ఇంట్లోనే ఉండేటోళ్లం. మా ఆయన కూలీనాలి చేస్తుండె. పిల్లలు పెద్దగా అయితుండ్రి. ఇల్లు కడతామో లేదో అనుకుంటిమి. కలగానే మిగుల్తుందేమో అని అనుకున్నాం. అల్లాదయతో మాకు ఇల్లు వచ్చింది. దివిటిపల్లిలో ఇల్లు ఇచ్చిండ్రు. సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం.
– రంజాన్‌బీ, దివిటిపల్లి, మహబూబ్‌నగర్
గత ప్రభుత్వాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారు. పేదల్ని పేదలుగానే ఉంచారు. ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ గృహకల్ప అంటూ మభ్య పెట్టారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కష్టాలు చూసి చలించారు. పేదలకు చిన్న గూడు లాంటి ఇండ్లు కాకుండా గౌరవప్రదంగా డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా కట్టి ఇవ్వాలని నిర్ణయించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేకంగా 2 వేల ఇండ్లు కేటాయించారు. మరో 2 వేల ఇండ్లు కూడా వివిధ స్కీంల కింద శాంక్షన్ చేసి కడుతున్నాం. దాదాపు 2 వేల కుటుంబాలకు నిలువ నీడ కల్పించిన ఘనత దక్కింది. కేటాయించిన ఇండ్లు కూడా మంచి డిమాండ్ ఉన్న ప్లేస్‌లో కట్టించి ఇచ్చినం.
– శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి
రాష్ట్ర ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని భావించగానే మాకు చాలా సంతోషమైంది. నా నియెజకవర్గంలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ప్రభుత్వ స్థలాలు, దాతలు ఇచ్చిన స్థలాలను గుర్తించి ఆయా గ్రామాలకు డబుల్బెడ్రూం ఇండ్లను కేటాయించాను. లబ్ధిదారులకు కూడా కోన్ని చోట్ల భాగస్వామ్యం కల్పించాం. మా సొంత గ్రామంలో కండ్ల ముందు కనిపించే పేదలకు కూడా మంచి ఇండ్లు కట్టించాలని భావించి మా నాన్న దివంగత ఆల రఘుపతిరెడ్డి జ్ఞాపకార్థం నాలుగెకరాలను కొని ఇండ్లు కట్టించాను. డబ్బులు ఎక్కువైనా భరించి పేదలకు మంచి ఇండ్లు కట్టించాము. పేదల కండ్లలో ఆనందం చూసి జన్మధన్యమైంది.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే, దేవరకద్ర