ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకున్నది. శ్రీశైలం జలాశయానికి వరద భారీగా వస్తుండడంతో నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు గేట్లను శనివారం ఉదయం గేట్లెత్తారు. వరదను దృష్టిలో ఉంచుకొని దిగువకు వదులుతున్నారు. టీఎస్, ఏపీ పవర్‌హౌస్‌ల నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఎగువ నుంచి వరద వస్తుండడంతో తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల గేట్లను మళ్లీ ఎత్తారు. జూరాలకు 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. 8 టీఎంసీలను నిల్వ ఉన్నది. తుంగభద్ర డ్యాంకు 40 వేల క్యూసెక్కులు వస్తున్నది. 104.945 టీఎంసీలు ఉంచి దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం, జూలై 23 : శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌వైపునకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువ నుంచి వరద కొనసాగుతూనే ఉండగా.. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుతుండడంతో శనివారం ఉదయం లాంఛనంగా మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటిరాంబాబు, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం అర్చకులతో కృష్ణమ్మకు చీర సారె, పసుపు, కుంకుమలు అర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 6, 7, 8 క్రస్గేట్లను స్విచ్ఆన్ చేసి నీటిని నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేశారు. మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు.
కాగా, జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి 40,060, విద్యుదుత్పత్తి నుంచి 40,613, సుంకేసుల నుంచి 29,952 క్యూసెక్కులు విడుదల కాగా.. సాయంత్రానికి 1,21,625 క్యూసెక్కులు శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లో నమోదైంది. అదే విధంగా శ్రీశైలం వద్ద ఏపీ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తికి 26,273 క్యూసెక్కులు, టీఎస్ పవర్‌హౌస్‌కు 31,784 క్యూసెక్కులు వదిలారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే వరద ఉధృతికి అనుగుణంగా రెండు లేదా ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తూ పూర్తిస్థాయి నీటిమట్టం నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.20 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 201.197 టీఎంసీల నిల్వ ఉన్నది.
అమరచింత, జూలై 23 : జూరాల రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద వస్తున్నది. శనివారం సాయంత్రానికి 78,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. పది గేట్లను ఎత్తి 40,600 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి కోసం 40,163 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.164 టీఎంసీలు నిల్వ ఉన్నది. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 1500, భీమా లిఫ్ట్-1కు 1300, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 178, సమాంతర కాలువకు 500, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తంగా 85,138 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
అయిజ, జూలై 23 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు మళ్లీ వరద మొదలైంది. దీంతో 10 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం డ్యాంలో 40,909 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 34,247 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకు గానూ ప్రస్తుతం 104.945 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 36,443 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 35,900 క్యూసెక్కులు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 544 క్యూసెక్కులు వదిలినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
