దేవరకద్రరూరల్, జూలై 23: దేవరకద్ర మండలంలోని పెద్ద గ్రామమైన కౌకుంట్లను ప్రభుత్వం కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 13మండలాలు ప్రకటించిన ప్రభుత్వం కౌకుంట్లను చేర్చడంతో శనివారం గ్రామంలో ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల, గోపన్‌పల్లి, పుట్టపల్లి, ఇస్రంపల్లి, రేకులంపల్లి, పేరూర్, చిన్న చింతకుంట మండలంలోని ముచ్చింతల, అప్పంపల్లి, దాసర్పల్లి, తిర్మలాపూర్ గ్రామాలు గతంలో కౌకుంట్ల మండల ఏర్పాటుకు తీర్మానాలు చేశాయి.
ఇవే కాకుండా కొత్తగా ఏర్పాటైన వెంకంపల్లి, వెంకటగిరి, రాజోళి పంచాయతీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మొత్తం 13గ్రామ పంచాయతీలతో కౌకుంట్ల కొత్త మండలంగా రూపుదిద్దుకోనున్నది. ఈ సందర్భంగా పలువులు నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొత్త మండలాల ఏర్పాటులో భాగంగా కౌకుంట్లను మండలంగా గుర్తించి ఆదేశాలు జారీ చేయడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కృషితో మండలం ఏర్పాటు చేశారని, ఎమ్మెల్యేకు, సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శివకుమార్, ఇస్రంపల్లి సర్పంచ్ శివరాజు, సింగిల్‌విండో డైరెక్టర్ కృష్ణగోపాల్, ఎంపీటీసీ కిష్టన్న, నాయకులు శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.