వనపర్తి, జూలై 3 : జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షిస్తున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇలాంటి కం టితుడువు చర్యల వల్ల గత జూన్ 28న జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ యజమాని సెల్లార్ నిర్మాణం కోసం తవ్వుతుండగా పక్కన ఉన్న గోడ కూలిపోయింది. సమయానికి అక్కడ ప్రజలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. కానీ గోడకు ఆనుకుని ఉన్న వ్యాపార సముదాయానికి సంబంధించి చాలా వరకు నష్టం జరిగింది.
మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా మున్సిపాలిటీ అనుమతు లు తీసుకోకుండా, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ ఇంటి నిర్మాణాలను చేపడితే, ఇంటి నిర్మాణానికి సంబంధించి టీఎస్ బీపాస్‌లో యజమాని పొందుపరిచిన విధంగా స్థలం ఉందా లేదా నిర్మాణం అలాగే జరుగుతుందా వంటి విషయాలతోపాటు ప్రధాన రహదారి అయితే సెట్‌బ్యాక్‌ను విడిచిపెడుతున్నాడా లేదా అనేది ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పర్యవేక్షించాలి. అలా అధికారులు నిర్మాణాల దగ్గరకు వచ్చిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తే వాటిని తొలగించడం జరుగుతుంది. గత సంవత్సరం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా నిర్మించిన ఇంటి నిర్మాణాలను, సెట్‌బ్యాక్ లేకుండా ఉన్న వాటిని గుర్తించామని అందులో రామాలయం సమీపంలో ఓ ఇంటి నిర్మాణాన్ని కొంతమేర తొలగించి మిగితా వాటిని పూర్తి స్థాయిలో తొలగిస్తామని చెప్పి అప్పటి వరకు హడావిడి చేసి మళ్లీ మరిచిపోయారు. దీంతో అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.
జిల్లా కేంద్రంలో రెండు, అంతకుమించి అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న సమయంలో సెల్లార్ నిర్మాణం కోసం మున్సిపల్ అనుమతులు విధిగా తీసుకోవాలి. సెల్లార్ నిర్మా ణం చేపట్టాలంటే స్థలం 900గజాలు ఉం టేనే సెల్లార్ నిర్మా ణం చేపట్టాలి. అది కూడా స్థలం యొక్క మట్టిని పరిశీలించి రిపోర్ట్స్, అగ్నిమాపక అనుమతులు, భవనం నిర్మాణం అయిన తరువాత ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఆ భవనం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా ఉండాలి. ఇటీవల జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలో ఓ యజమాని సెల్లార్ నిర్మించేందుకు పనులు చేస్తుండగా పక్కన గల గోడ కూలిపోగా అక్కడ ప్రజలు లేనందుకు ప్రాణనష్టం జరుగలేదు. అక్కడ సెల్లార్ నిర్మించడానికి సరైన స్థలం లేదంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యజమాని మాత్రం అధికారుల మాటలు పెడచెవిన పెట్టి పనులు చేస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. జిల్లా వ్యాప్తంగా 5 మున్సిపాలిటీల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా దాదాపు 45కు పైగా అక్రమ సెల్లార్ల నిర్మాణాలు ఉన్నాయి. వనపర్తిలో25, కొత్తకోటలో 5, పెబ్బేర్‌లో 6, ఆత్మకూర్‌లో 6, అమరచింతలో 3 చొప్పున అక్రమ సె ల్లార్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
మున్సిపాలిటీ అనుమతులు లేకుండా, సరైన స్థలం లేకుండా తక్కువ స్థలంలో సెల్లార్ నిర్మాణాలు చేపడితే అటువంటి యజమానులపై మున్సిపాలిటీ చట్టం ప్రకారంగా చర్యలు తీసుకుం టాం. అదేవిధంగా ప్రధాన రహదారి, రహదారి గుండా నూతనంగా నిర్మించే నిర్మాణాల్లో కమర్షియల్ అయితే 10 ఫీట్లు, గృహ నిర్మాణాలు అయితే 5 ఫీట్లు సెట్‌బ్యాక్ విధిగా ఉండాల్సిందే. మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా నిర్మించిన సెల్లార్లను గుర్తించి చర్యలు తీసుకుంటాం.
– గట్టుయాదవ్, మున్సిపల్ చైర్మన్, వనపర్తి
నూతనంగా ఇంటి నిర్మాణాలు, సెల్లార్లు నిర్మించే సమయంలో మున్సిపాలిటీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. టీఎస్ బీపాస్‌లో ఒకలా అనుమతులు మరొకలా నిర్మాణాలు చేపడితే అటువంటి యజమానులపై జరిమానా విధిస్తాం. అక్రమంగా నిర్మించిన సెల్లార్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటాం. గతంలో నిర్మించిన సెల్లార్లో విద్యుత్‌కు సంబంధించి మీటర్లు వంటివి పెట్టకుండా జా గ్రత్తలు తీసుకోవాలి. సెల్లార్లో విధిగా మోటరును ఏర్పాటు చేసుకోవాలి.
– విక్రమసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్, వనపర్తి