మరికల్, జూలై 3 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొనసాగుతున్న మహబూబ్‌నగర్-మునీరాబాద్ రైల్వేలైన్ పనులు దేవరకద్ర నుంచి మాగనూర్ వరకు పూర్తయ్యా యి. అయితే జక్లేర్-మహబూబ్‌నగర్ మధ్య రెండేండ్ల కిం దట వారానికి రెండుసార్లు తిరిగిన రైలు ప్రస్తుతం నిలిచిపోవడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. కోట్లు ఖర్చు పెట్టి రైల్వేలైన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం రైల్వే లైన్‌పై నిర్లక్ష్యం చేసింది. దేవరకద్ర నుంచి కృష్ణ వరకు 70 కిలో మీటర్లకుగానూ 60 కిలో మీటర్ల వరకు పనులు పూర్తి కావడం విశేషం. రెండేండ్లుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైల్వే శాఖ అధికారుల తీరుపై ఆగ్ర హం వ్యక్తం చేశారు.
దేవరకద్ర నుంచి మాగనూర్ వరకు రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించినా ఇప్పటికీ రైళ్లు ఎందుకు తిరగడం లేదని విమర్శిస్తున్నారు. దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూర్, కృష్ణ వరకు రైల్వేస్టేషన్ల పనులు పూర్తయ్యాయి. మార్చి 25, 2017న దేవరకద్ర నుంచి జక్లేర్ వరకు అధికారులు రైల్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం నిలిచిపోవడంతో వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
నిత్యం దేవరకద్ర నుంచి మాగనూర్ వరకు రైళ్లను కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. గతంలో వారానికి రెండుసార్లు నడిచే రైలు కరోనా వల్ల నిలిచిపోవడంతో మరికల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జిల్లాకు సంబంధించి రైల్వేస్టేషన్ మరికల్‌కు దగ్గర ఉండడంతోపాటు కృష్ణ వరకు పనులు పూర్తైతే రాయిచూర్ నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే గోవా, ముంబాయి, పుణే తదిర ప్రాంతాలకు దూరం తగ్గుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిత్యం రైళ్లను నడుపాలని ప్రయాణికులు కోరుతున్నారు.