అచ్చంపేటరూరల్, జూన్ 15: నల్లమల యువత స్వయం సాధికారత దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలో షామ్స్ ఫంక్షన్హాల్లో జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో విప్ గువ్వల మాట్లాడుతూ యువత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కుటుంబంలో ఒకరు స్థిరపడినా మిగతా వారిపై అతడి ప్రభావం ఉంటుందన్నారు.
ప్రతిఒక్కరూ ఏదో ఓ రంగంలో ప్రతిభ కనబర్చుతారని, వాటిని వెలికి తీసేందుకు శిక్షణ అవసరమన్నారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గువ్వల అమల మాట్లాడుతూ తన సొంత ఖర్చులతో నల్లమల నిరుద్యోగులకు మూడు నెలలపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత శిక్షణలో పాల్గొని ప్రయోజకులు కావాలనే తపనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము సొంత పనులను సైతం వదులుకొని యువతకు అన్ని రకాలుగా సలహాలు, సూచనలు ఇవ్వడానికి సమయాన్ని కేటాయిస్తున్నామన్నారు.
మేధా కెరీర్ కోచ్ డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ నాది, నేను, నా కుటుంబం అనే అహాన్ని వీడి ప్రతిఒక్కరూ మాది, మనది, మన సమాజం అనే విశాల ధృక్పథాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ గువ్వల యువతకు స్వయంగా భోజనం వడ్డించారు. మూడు నెలలపాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో మూడు పూటలా భోజనం, వసతి, స్టడీ మెటీరియల్ అందించి ప్రతి రోజూ శిక్షకులకు తర్పీదు ఇవ్వనున్నట్లు తెలిపారు. అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, ఆర్డీవో పాండునాయక్, మున్సిపల్ వైస్‌చైర్మన్ శైలజారెడ్డి, జెడ్పీటీసీ మూడవత్ రాంబాబునాయక్, ఎస్సైలు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాసులు, గురుస్వామి, సదాశివగౌడ్, శిక్షకులు రాకేశ్, కౌన్సిలర్లు అంతటి శివ, గడ్డం రమేశ్, టీఆర్ఎస్ నాయకులు కోళ్ల శంకర్, శ్రీరాం, అజయ్, వంశీ, సోమ్లా తదితరులు పాల్గొన్నారు.