వనపర్తి రూరల్, జూన్ 15 : రాష్ట్రంలో పంటల నియంత్రిత సాగు విధానం వల్ల రైతులకు అధికదిగుబడులను అందించే దిశగా పభుత్వం పంటలసాగులో మార్పులను తీసుకొచ్చి ఒకే రకం పంటలను వేయకుండా భూమి సారాన్ని బట్టి పంటలు సాగు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నది. అందులో భాగంగా ఈ ఏడాది కంది సాగును పెంపొందించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పండించిన కంది సాగును ప్రభుత్వమే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుం టున్నది.
రైతు లాభదాయకమైన పంటలు పండించి తానే ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలనేదే ప్రభుత్వ ధ్వేయం. రైతులు కంది పంటను సాగు చేయడం వల్ల భూ సారం పెరుగుతుంది. కంది ఆకులు భూమిపై రాలడం వల్ల ఎరువుగా ఉపయోగ పడుతుంది. కందిపప్పు ధాన్యపు పంట కావడం వల్ల భూమి నత్రజనిని స్వీకరించి యూరియా, నత్రజని వాడకాన్ని తగ్గించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుంది. దీనిని అంతర్ పంటగా సాగు చేసుకోవడంతోపాటు నేలకోతను ఆరికట్ట వచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకొని దిగుబడినిస్తుంది.
ఎంతటి వాతావరణమైనా, ఎలాంటి నేలలైనా తట్టుకునే పంట కంది. కొన్ని మెళకువలు పాటిస్తే అధిక లాభాలు తెచ్చి పెట్టే ఈ పంటను ప్రధానంగా పత్తి, తదితర అంతర్ పంటలో సాగు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అంతర్పంటగా సాగు చేసుకొనేందుకు వెసులుబాటు ఉండటంతో రైతులు కంది సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడులు సాధించడానికి నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవడంతోపాటు అనువైన రకాలను ఎంచుకోవడం ముఖ్యం.
పీఆర్జీ 176 (ఉజ్వల) : ఈ రకం పంటకాలం 130 నుంచి 135 రోజులు. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలకు ఎర్ర, చెలక నేలలకు అనువైనది.
ఐసీపీహెచ్ -2740 (మన్యంకొండ కంది) : ఈ రకం పంటకాలం 170 నుంచి 190 రోజులు. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నల్ల రేగడి నేలల్లో సాగు చేయడానికి అనువైన రకం. ప్యూజేరియం ఎండు తెగులు, వెర్రి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది.
టీడీఆర్జీ-4(హసుమ) : ఈ రకం పంటకాలం 160 నుంచి 180 రోజులు ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల ది గుబడి వస్తుంది. నల్లరేగడి నేలల్లో సాగు చేయడానికి అనువైన రకం. ప్యూజేరియం ఎండు తెగులును, వెర్రి తెగులు, శనగపచ్చ పురుగును కొంత మేరకు తట్టుకుంటుంది.
ఆర్జీటీ-1(తాండురు తెల్లకంది) : ఈ రకం పంటకాలం 145 నుంచి 155 రోజులు. ఎకరానికి 5 నుంచి 6 క్విం టాళ్ల దిగుబడి వస్తుంది, తేలికపాటి, నల్ల భూములకు అనువైనరకం. ప్యూజేరియం ఎండుతెగులును తట్టుకుంటుంది.
డబ్ల్యూఆర్జీ- 65 (రుద్రేశ్వర) : ఈ రకం పంటకాలం 160 నుంచి 180 రోజులు. ఎకరానికి 8 నుంచి 10 క్విం టాళ్ల దిగుబడి వస్తుంది. నల్లరేగడి నేలల్లో సాగు చేయ డాని కి అనువైన రకం. ప్యూజేరియం ఎండు, వెర్రితెగులు, శనగపచ్చ పురు గును కొంతమేరకు తట్టుకుంటుంది.
డబ్ల్యూఆర్జీ- 27 : ఈ రకం పంటకాలం 180 రోజులు. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పువ్వు లు ఎరుపు రంగులో ఉంటాయి. శనగపచ్చ పురుగును కొంతమేరకు తట్టుకుంటుంది.
ఐసీసీఎల్ -87119 (ఆశ) : ఈ రకం పంటకాలం 170 నుంచి 180 రోజులు. ఎకరానికి 7నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కనిటారుగా, గుబురుగా పెరుగుతుంది. ప్యూజేరియం ఎండు, వెర్రితెగులు తట్టుకుంటుంది.
ఐసీపీ -8863 (మారుతి) : ఈ రకం పంట కాలం 155 నుంచి 160 రోజులు. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది.
ఐసీపీఎల్ -85063 (లక్ష్మి) : ఈ రకం పంటకాలం 160 నుంచి 170 రోజులు. ఎకరానికి 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మ లు కలిగి ఉంటుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది.
ఎల్ఆర్జీ -41 : ఈ రకం పంటకాలం 180 రోజులు. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నల్ల రేగడి నేలల్లో సాగు చేయడానికి అనువైన రకం. శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది.
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు కొన్ని సూచనలు పాటించాలి. నాణ్యమైన విత్తనాలను మా త్రమే ఎంపిక చేసుకొవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా చే యాలి. ఎరువులను తగు మో తాదులో సరైన సమయంలో వేయాలి. కీలకమైన దశలో పంటకు నీరు పెట్టాలి. సమగ్ర సస్యరక్షణ చర్య లు పాటించాలి. సరైన సమయంలో పంటకోయడం, విత్తన నిల్వలో జాగ్రత్తలు పాటిస్తే మంచి లాభాలు ఉంటాయి.
– కురుమయ్య, మండల వ్యవసాయశాఖ అధికారి, వనపర్తి